బీజేపీకి మంత్రి ఎర్రబెల్లి బస్తీ మే సవాల్..

22
Minister Errabelli

ప్రతి పౌరుడి ఖాతాలో రూ.15 లక్షలు పడ్డయా? అధికారంలోకి వచ్చిన వెంటనే నల్లధనం వెలికి తీస్తా అన్నారు ఏమైంది?! నల్ల ధనం తెళ్లగైందా?!… ఇవేమీ జరగలేదు. జరగవు. కేంద్రం మన రాష్ట్రానికి వరద సాయం ఎందుకు చేయలేదు?! ఇవి బీజేపీ ఆడి తప్పిన మాటలు. బీజేపీ మాయ మాటలు నమ్మొద్దు.. బొందలో పడొద్దు. సోషల్‌ మీడియాల జిమ్మిక్కులకు మోసపోవద్దు. ఇప్పటికే, దుబ్బాక ప్రజలు బీజేపీకి ఎందుకు ఓటు వేశామా?! అని బాధ పడుతున్నారు. భాగ్యలక్ష్మి, భద్రకాళి టెంపు ల్స్ కాదు… దమ్ముంటే వరంగల్ కార్పొరేషన్ కు రండి. ప్రజలకు ఎవరు ఏమి ఇచ్చారో? ఎవరు ఏమి చేశారో తేల్చుకుందాం అని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీజేపీకి మంత్రి ఎర్రబెల్లి బస్తీ మే సవాల్ విసిరారు. ఆదివారం మల్లాపూర్ లోని వి ఎన్ ఆర్ గార్డెన్స్ లో జరిగిన మీర్ పేట్ హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ కృతజ్ఞత సభలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ వైఖరిపై మండి పడ్డారు. కేంద్రంలో అధికారంలోకి రావడానికి ముందు బీజేపీ ఇచ్చిన హామీలే వీ నెరవేరలేద న్నారు. పైగా, అబద్ధాలతో బీజేపీ ప్రజలను బుకాయిస్తున్నదని మంత్రి విమర్శించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు మాత్రమే కాదు ఇవ్వని హామీలను కూడా నెరవేర్చి0 దని మంత్రి ఎర్రబెల్లి వివరించారు. మన రాష్ట్రం సీఎం కేసిఆర్ నేతృత్వంలో అభివృద్ధి – సంక్షేమంలో అగ్రగామిగా, దేశంలో నెంబర్ వన్‌గా ఉన్నామని మంత్రి చెప్పారు. కేంద్రాన్ని మన రాష్ట్రం అడిగిన వాటిలో ఒక్కటి కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు? నయా పైసా నిధులు ఇవ్వలేదు? మిషన్ భగీరథ ను అదే పనిగా అభినందిస్తున్నారు, కానీ, కానీ పైసా ఇవ్వడం లేదు. నీతి అయోగ్ చెప్పిన మీకు చెవి మీద పేను పారలేదు. అదే గుజరాత్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల కు అడగక ముందే ఇచ్చేశారు. ఇదేం ద్వంద్వ నీతి? అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు.

బీజేపీ తెలంగాణకు వరద సాయం ఎందుకు ఇవ్వలేదు? కేవలం అబద్ధాల మాటలతో ప్రజలను మోసం చేయడమే బీజేపీ పనిగా పెట్టుకుంది. బీజేపీని నమ్మి మోసపోవద్దని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.భాగ్యలక్ష్మి, భద్రకాళి దేవాలయాలు కాదు, దమ్ముంటే చేసిన అభివృద్ధి మీద అధికారిక చర్చకు బీజేపీ రావాలన్నారు. తొండి, బండిలు కాదు, కేంద్ర మంత్రులు వచ్చి చర్చకు సిద్ధపడాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సవాల్ విసిరారు. బీజేపీ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. లేదంటే బీజేపీని ప్రజలు ఉరికిచ్చి కొడతారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు.

మీర్ పేట్ హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ ను కంటికి రెప్పలా కాపాడు కుంటాను, ఇచ్చిన మాట ప్రకారం…డివిజన్ ను దత్తత తీసుకుని… అభివృద్ధి చేస్తాను. ఎవరికి ఏ సమస్య ఉన్నా, నా వద్దకు రండి అని మంత్రి ప్రజలకు చెప్పారు. డివిజన్ లో మంచి మెజారిటీతో గెలిచిన ప్రభుదాస్ కు, గెలిపించిన ప్రజలకు శుభాకాంక్షలు…! అభినందనలు!! తెలిపారు. ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకావాలని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీఆరెఎస్ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు బండారి లక్ష్మారెడ్డి, చల్లా రామ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, గొల్లురీ అంజయ్య, ముఖ్య నేతలు, వివిధ అసోసియేషన్ ల ప్రతినిధులు, కాలనీల పెద్దలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.