పల్లె ప్రగతి కార్యక్రమం ఓ నూతన సమగ్ర గ్రామీణ విధానం. తెలంగాణ గ్రామాలు దేశంలోనే ఆదర్శంగా మారాలనేది సిఎం కెసిఆర్ ఆశయం. పల్లెల్లో పచ్చదనం-పరిశుభ్రత వెల్లి విరియాలనేది ప్రభుత్వ లక్ష్యం. ప్రణాళికా బద్ధంగా గ్రామాలు అభివృద్ధి చెందాలనేది ప్రభుత్వ ఉద్దేశం. సిఎం కెసిఆర్ ఆలోచనల మేరకే ఈ పథకం అమలవుతోంది. మూడు విడతలుగా గ్రామాల్లో పల్లె ప్రగతి ప్రత్యేక అవగాహన, చైతన్య కార్యక్రమాలు ప్రభుత్వం నిర్వహించింది అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అలాగే, గ్రామాల్లో ప్రజలకు జీవన భద్రత కల్పించడం, నీటి పారుదల ప్రాజెక్టులు నిర్మించడం, మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేయడం, చేతి, కుల వృత్తులకు చేయూతనివ్వడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, సాగునీరు, మంచినీరు, ఆసరా పెన్షన్లు ఇవ్వడం, మహిళలకు స్త్రీ నిధి ద్వారా వడ్డీ లేని రుణాలు ఇవ్వడం, రహదారుల నిర్మాణం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టడం, మౌలిక వసతుల ఏర్పాటు వంటి వాటిని ప్రభుత్వం పెంచుతున్నది.. అందులో భాగంగానే కేంద్రం ప్రకటించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తి కరణ్ పురస్కార్ కింద రాష్ట్రానికి 12 అవార్డులు దక్కాయని ఆయన అన్నారు.
ఈ అవార్డులు సాధించిన సంగారెడ్డి జెడ్పీ చైర్ పర్సన్, మండల పరిషత్ అధ్యక్షులు, గ్రామ పంచాయతీల సర్పంచ్ లు, సిఇఓ, ఎంపీడీఓలు, గ్రామ కార్యదర్శులు తదితరులను హైదరాబాద్‌కు పిలిపించిన మంత్రి, ఖైరతాబాద్‌లో గల రంగారెడ్డి జిల్లా పరిషత్ లోని మంత్రి కార్యాలయం కాన్ఫరెన్స్ హాలులో వారిని సత్కరించారు. ఆత్మీయంగా అభినందించారు. అనంతరం వారిని ప్రగతి భవన్‌కు తీసుకెళ్ళి, సీఎం కెసిఆర్‌తో కలిపించారు. ఈ సందర్భంగా సీఎం కెసిఆర్ వారందరినీ సత్కరించారు. అభినందించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో సీఎం కెసిఆర్ ప్రవేశ పెట్టిన పల్లె ప్రగతి వంటి పథకాలు, ఆ పథకాలను బాగా అమలు చేస్తున్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరి కష్టం ఫలితమే ఈ అవార్డులు. సీఎం కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తెచ్చి పాలనలో పారదర్శకత, జవాబుదారి తనాన్ని పెంచిండ్రు అని అన్నారు. ప్రతి గ్రామానికి.. ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లు ఇచ్చుకున్నం. నర్సరీలు, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు నిర్మించుకుంటున్నం అని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా జిల్లా పరిషత్ కు 5శాతం, మండల పరిషత్ లకు 10శాతం, గ్రామ పంచాయతీలకు 85శాతం నిధులను సిఎం కేటాయించారు. తాజాగా బడ్జెట్‌లో మండల, జిల్లా పరిషత్ లకు 500 కోట్లు పెట్టారు. అందులో మండల పరిషత్ లకు 242కోట్లు, జిల్లా పరిషత్ లకు 258 కోట్లు కేటాయించారని వివరించారు.
కేంద్ర ఫైనాన్స్ కమిషన్…ఈ సారి 18వందల 40 కోట్లకు బదులు, 13 వందల 60 కోట్లు మాత్రమే కేటాయించిందని, 500 కోట్ల కోత విధించినా, వివక్ష చూపిస్తున్నా…సరే, సిఎం కెసిఆర్ గారు మాత్రం గ్రామ పంచాయతీలకు క్రమం తప్పకుండా నెలకు 308 కోట్లు ఇస్తున్నారు. అవార్డులు ఇస్తున్న కేంద్రం మరింత ఆర్థిక సహాయం చేసి ప్రోత్సహించాల్సిందిపోయి, నిధుల్లో కోత పెట్టడం ఎంత వరకు సమంజసమని అడిగారు. ఈ విషయమై సిఎం కెసిఆర్ సూచనల మేరకు, అవసరమైతే ఢిల్లీకి వెళ్ళి, కేంద్ర మంత్రిని, ప్రభుత్వాన్ని కలుస్తామని, మరిన్ని నిధులు కావాలని అడుగుతామని చెప్పారు.
అవార్డులు, రివార్డులు మనకు కొత్త కాదు, ఇంతకుముందే అనేక అవార్డలు వచ్చాయి. ఇంకా వస్తున్నాయి. అవార్డులు వచ్చే విధంగా కష్ట పడుతున్న మీ అందరినీ పేరు పేరునా అభినందిస్తున్నాను. గ్రామాల స్వరూపాన్ని సమగ్రంగా మార్చేసిన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిరంతరంగా నిర్వహించాలి. పారిశుద్ధ్యం- పచ్చనదం పల్లెల్లో పరచుకోవాలి. ఒకప్పుడు ఆదర్శ గ్రామాలంటే…ఒకటి అరా ఉండకపోయేది. ఒక్క గంగదేవి పల్లెనే ఆదర్శ గ్రామంగా అంతా చెప్పకునే వాళ్ళు. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఆదర్శ గ్రామాలు తయారైనయి. ఇదంతా స్థానిక సంస్థల ప్రతినిధులు, రాష్ట్రం నుంచి పారిశుద్ధ్య కార్మికుల వరకు అధికారులందరి విజయం అని అభినందించారు. అందుకే సీఎం కెసిఆర్ జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శులతో సమానంగా వేతనం ఇవ్వాలని నిర్ణయించారని చెప్పారు. కరోనా విస్తృతి నేపథ్యంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు మరింత అప్రమత్తంగా పని చేయాలని మంత్రి ఆదేశించారు.
ఈ ఆత్మీయ సమ్మేళనంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్ రావు, సంగారెడ్డి జెడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, పాల ఉత్పత్తిదారుల సంస్థ చైర్మన్ లోక భూమారెడ్డి, ఆ రెండు శాఖల అధికారులు, సిబ్బంది, విజేతలుగా నిలిచిన సర్పంచ్ లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.