ఈ నెల 31న ముఖ్యమంత్రి కేసీఆర్ కొడకండ్ల మండల కేంద్రానికి రానున్న నేపధ్యంలో సిఎం పర్యటన ఏర్పాట్లను, రైతు వేదిక, పల్లె ప్రకృతి వనం, సభా స్థలం, డబుల్ బెడ్ రూం ఇండ్లు, హెలిప్యాడ్ నిర్మాణ పనులను రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. ఈ నెల 31 న మంచి ముహూర్తం ఉన్నందున రాష్ట్రంలోని రైతులు సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో సిఎం కేసీఆర్ జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలోని రైతు వేదికను ప్రారంభించనున్నారు. అనంతరం పల్లె ప్రకృతి వనం ను సందర్శించనున్నారు.
రైతు వేదిక ప్రారంభోత్సవం అనంతరం స్థానిక మార్కెట్ ఆవరణలో ఏర్పాటు చేసే సభలో 5వేల మంది రైతులతో ముఖాముఖి మాట్లాడతారు. ఈ రైతు సభా వేదిక ద్వారా రైతు వేదికల ముఖ్య ఉద్దేశ్యాలను నేరుగా రైతులకు, తద్వారా రాష్ట్రంలోని రైతాంగానికి వివరించనున్నారు. 573కోట్లతో రాష్ట్రంలో 2604 రైతు వేదికలను నిర్మిస్తున్నారు. ప్రతి 5వేల రైతులకు ఒక రైతు వేదికను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. రైతు వేదికల ద్వారా రైతులను సంఘటితం చేయడం, సమావేశాల ద్వారా గిట్టుబాటు ధరలు తెలుసుకోవడం, వ్యవసాయ మెలకువలు నేర్చుకుని, మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంటుందన్నారు మంత్రి ఎర్రబెల్లి.
వ్యవసాయ రంగ అభివృద్ధికి మన రాష్ట్రంలో సిఎం కెసిఆర్ తీసుకున్నన్ని చర్యలు దేశంలో మరెవరూ తీసుకోలేదు. రెవిన్యూ నూతన చట్టం రైతులకు వరంగా మారింది. సాగునీరు, 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు, రుణాల మాఫీ, బీమా వంటి పథకాలు ఎక్కడా అమలు కావడం లేదు. తెలంగాణలో ఇలా ఉంటే, వ్యవసాయానికి కేంద్రం ఇబ్బందులు పెట్టే పథకాలు చేపడుతున్నదని మంత్రి తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించాలని సిఎం ని కోరడంతో, అధికారులతో నివేదిక తెప్పించుకుని జనగామ జిల్లా కొడకండ్లను వారే ఖరారు చేయడం అదృష్టంగా భావిస్తున్నా ను. సిఎం గారు ఫోన్ ద్వారా కొడకండ్లతో తనకున్న అనుబంధాన్ని తెలిపారు.
సిఎం పర్యటన నేపధ్యంలో అధికారులు అయా పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి. రైతులకు ఇబ్బందులు లేకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి ఎర్రబెల్లి అధికారులకు సూచించారు. అనంతరం సీఎం పర్యటన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ కె నిఖిల, డీసీపీ, ఏసీవీ, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. వాళ్ళ కు బాధ్యత లు అప్పగించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.