సంక్షేమంలో మన రాష్ట్రమే ముందుందని, దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలోనే సీఎం కెసిఆర్ ఆధ్వర్యంలో అమలు అవుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా పరిధిలోని, పాలకుర్తి నియోజకవర్గంలో రాయపర్తి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 43 మందికి 43లక్షల, 4వేల 988 రూపాయల విలువైన కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలు మన రాష్ట్రంలోనే అమలు అవుతున్నాయన్నారు. కరోనా కష్ట కాలంలోనూ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్న ఘతన మన సీఎం కెసిఆర్ దే అన్నారు. కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు ఇస్తూ, సీఎం కెసిఆర్, ప్రతి పేదింటి పెద్దన్నయ్య అయ్యారని కొనియాడారు. ఇక రైతాంగాన్ని ఆదుకోవడంలో, రైతుని రాజుని చేయడంలో సిఎం కెసిఆర్ చూపిస్తున్న తెగువ, చొరవ ముందు ఎవరైనా దిగదుడిపేనన్నారు.
ఒకవైపు వ్యవసాయాన్ని మన రాష్ట్రంలో సీఎం కెసిఆర్ పండుగ చేస్తుంటే, దేశంలో దండుగ చేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నదన్నారు. రైతుల భూములను కొత్త రెవిన్యూ చట్టం ద్వారా మన సీఎం కెసిఆర్ కాపాడాలని చూస్తుంటే, అవే రైతుల భూములను కార్పొరేట్లకు అప్పగించే పనికి కేంద్రం పూనుకున్నదన్నారు. ఇటు రెవిన్యూ, అటు కేంద్ర వ్యవసాయ చట్టాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని మంత్రి సూచించారు. ఇక ప్రతి మనిషి పుట్టుకకు ముందు నుంచి మరణానంతరం వరకు అనేక ప్రభుత్వ సేవలు ఉచితంగా అందేలా సీఎం కెసిఆర్ అనేక పథకాలను రూపొందించి అమలు చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి వివరించారు. ఈ పథకాలను సద్వినియోగం చేసుకుని ప్రజలు బాగుపడాలన్నదే సీఎం కెసిఆర్ లక్ష్యమన్నారు.
ఇండ్లు కోల్పోయిన వాళ్ళకు పరిహారం..
ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు ఇండ్లు దెబ్బతిన్న, కూలి పోయి న బాధితులకు పరిహారాలను మంత్రి ఈ సందర్భంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారులు, పలువురు ప్రజలు పాల్గొన్నారు.