ట్రెండింగ్‌లో ఈక్వాలిటీ ఫర్‌ తెలంగాణ హ్యాష్ ట్యాగ్…!

49
modi
- Advertisement -

తెలంగాణ పర్యటనలో ప్రధాని మోదీకి చేదు అనుభవం ఎదురైంది. కేంద్రబడ్జెట్‌లో ఈసారి కూడా రాష్ట్రానికి మొండి చేయి చూపిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు , ముఖ్యంగా యువత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈనేపథ్యంలో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ విగ్రహావిష్కరణ కోసం హైదరాబాద్‌లోని ముచ్చింతలకు వచ్చిన ప్రధాని మోదీకి తెలంగాణ యంగ్‌స్ట‌ర్స్ ప‌లు ప్ర‌శ్న‌ల‌ను సంధించారు. సమతామూర్తి సరే..తెలంగాణ పట్ల సమానత్వం ఏమైంది అంటూ ఈక్వాలిటీ ఆఫ్ తెలంగాణ పేరుతో ట్యాంక్ బండ్ దగ్గర ఓ భారీ బ్యాన‌ర్‌ను ప్ర‌ద‌ర్శించి ప్రధాని మోదీకి తీవ్ర నిరసన తెలిపారు.

అంతే కాదు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ విగ్రహావిష్కరణకు వచ్చిన మోదీకి ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ హ్యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తెలంగాణకు చెందిన నెట్‌జన్లు, ప్రజా ప్రతినిధులు, నాయకులు ట్విట్టర్ వేదికగా రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించారు. రైల్ కోచ్ ఫ్యాక్ట‌రీ ఎక్క‌డ‌? ఐటీఐఆర్ ఎక్క‌డ‌? ప‌సుపు బోర్డు సంగ‌తేంటి? తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల‌కు జాతీయ హోదా ఎక్క‌డ‌? హైద‌రాబాద్ మెట్రో ఫండ్స్ కేటాయింపులెక్క‌డ‌? ఎన్డీఆర్ఎఫ్ ఫండ్స్ ఎక్క‌డ‌? మెడిక‌ల్ కాలేజీల సంగతేంటి? అని మోదీని యువ‌త నిల‌దీశారు. తెలంగాణ యువత, టీఆర్ఎస్ శ్రేణుల దెబ్బతో ట్విట్టర్‌లో ‘పొలిటికల్‌’ విభాగంలో ‘ఈక్వాలిటీ ఫర్‌ తెలంగాణ’ హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లో నంబర్‌-1గా నిలిచింది. పలువురు రాష్ట్రమంత్రులు సైతం ప్రధాని పర్యటన సందర్భంగా తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వ వివక్షను ప్రశ్నించారు.

కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట్ రైల్వే కోచ్, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, మేడారం సమ్మక్క సారక్క జాతర వంటి అంశాలపై కేంద్రం తెలంగాణపట్ల చూపుతున్న వివక్షను రాష్ట్రమంత్రులు ఎండగట్టారు. మొత్తంగా తెలంగాణలో పర్యటన సందర్భంగా తెలంగాణ యువత ప్రధాని మోదీకి చుక్కలు చూపించారనే చెప్పాలి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘ఈక్వాలిటీ ఫర్‌ తెలంగాణ’ హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌గా నెంబర్‌ వన్‌గా ట్రెండింగ్‌ అవడం జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -