టీ 20 వరల్డ్ కప్‌లో భారత మహిళల జట్టు పోరు ముగిసింది. మళ్లీ అదే తడబ్యాటు. గ్రూప్ దశలో తిరుగులేని విజయాలు సాధించిన హర్మన్ సేన సెమీస్‌లో చతికిలపడింది. అంటిగ్వా వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలై ఇంటి దారిపట్టింది.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్…ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి 19.3 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. 113 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఆడుతుపాడుతు లక్ష్యాన్ని చేధించింది. భారత్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అమీ జోన్స్ (53), నటాలీ సివర్ (51)లు అర్ధసెంచరీలతో చెలరేగడంతో 17.1 ఓవర్లలోనే విజయాన్నందుకుంది.
అంతకముందు భారత బ్యాట్స్‌ఉమెన్స్‌లో స్మృతి మంధాన (34), జెమీమా రోడ్రిగ్స్(26)లవే టాప్ స్కోర్ సాధించారు. హార్డ్ హిట్టర్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ (16), కృష్ణమూర్తి (2), బాటియా (11)లు తీవ్రంగా నిరాశ పరిచారు.2017 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో టైటిల్ ముందు బోల్తాపడ్డ భారత మహిళలు.. నేడు టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో చేతులెత్తేశారు.
మరోపోరులో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ ఘనవిజయం సాధించింది. ఆతిథ్య వెస్టిండీస్‌పై 71 పరుగులతో ఘన విజయం సాధించింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఆసీస్.. ఇంగ్లండ్‌ను ఢీకొట్టనుంది.