ఉద్యోగాలు చెయ్యాలా? వద్దా?

241
Employee's Saree Pulled By Senior,
Employee's Saree Pulled By Senior,
- Advertisement -

దేశంలో రోజురోజుకు మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఇంట్లో, రోడ్డుమీదే కాదు, ఆఫీసుల్లో కూడా మహిళలకు రక్షణ లేకుండా పోతున్నది. గడప దాటి పొట్టకూటి కోసం పనికెళ్లే స్త్రీలపై ఆఫీసుల్లో తోటి ఉద్యోగులు, పై అధికారుల లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయని ఆ మధ్య సర్వేలో తేలింది. ఆఫీసుల్లో లైంగికంగా వేధించిన వారిపై కేసు పెడితే ఉద్యోగం పోతుందని, పరువు పోతుందని మౌనం వహించడం వల్లే ఇలాంటి ఘటనలు ఇంకా రోజుకో మూలకు జరుగుతున్నాయి.

తాజాగా ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ మహిళను అక్కడి సినీయర్ ఉద్యోగి చీర లాగడం సంచలనంగా మారింది. సీసీటీవీలో రికార్డైన ఈ దృశ్యాలు వైరల్‌ అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలో ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో బాధితురాలు (33) విధులు నిర్వహిస్తోంది. జూలై 29న ఆమె పుట్టిన రోజు సంధర్బంగా ఆ హోటల్ లో సెక్యూరిటీ మేనేజర్ గా పని చేస్తున్న సీనియర్ ఎంప్లాయి ఆమెను చీర లాగి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై ఆమె ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడింది ఆమె మాటల్లోనే “జూలై 29న రోజు నా పుట్టిన రోజు. ఆయన తన క్యాబిన్ కు నన్ను పిలిచాడు. క్రెడిట్ కార్డు తీసి చూపుతూ ఏం బహుమతి కావాలో కోరుకోమని అడిగాడు. తన పక్కన కూర్చోమని చెప్పాడు. నేను కూర్చోకుంటే, చీర కొంగు పట్టుకుని దగ్గరకు లాక్కున్నాడు. పక్కన ఉన్న ఇతర ఉద్యోగులను బయటకు వెళ్లాలని ఆదేశించాడు. రాత్రికి తనతో గడపాలని అడిగాడు” అని ఆమె తనకు జరిగిన అవమానాన్ని చెప్పుకొచ్చింది.

ఈ ఘటనను ఆమె అదే రోజు ఆ హోటలర్‌ హెచ్‌ఆర్‌ విభాగం దృష్టికి తీసుకెళ్లగా వారు ఎలాంటి చర్యా తీసుకోలేదు. చివరకు భర్త సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనంతా సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. ఇక నిన్న ఆమెను విధుల నుంచి తొలగిస్తున్నట్టు హోటల్ యాజమాన్యం ప్రకటించింది. సీసీటీవీ ఫుటేజ్ ని ఆమెకు అందించిన మరో సహోద్యోగిని కూడా తొలగించడంపై విమర్శలు వస్తున్నాయి.

చాలా సందర్భాల్లో నిందితుడు బాధితురాలికన్నా పెద్ద పొజిషన్‌లో ఉండటంతో, సహోద్యోగుల సలహా సైతం రాజీనామా చేయమనే వస్తోంది. చాలా కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని రక్షించేందుకు అంతర్గతంగా యత్నాలు జరుగుతున్నాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి. దీనికి ఉదాహరణ తెహల్కా కేసు. మీడియాలో వివరాలు వచ్చిన తరువాతనే తెహల్కా చీఫ్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆఫీసుల్లో ఉన్నత ఉద్యోగులు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడితే.. వాళ్లు ఉద్యోగాలు చేయ్యాలా? వద్దా? అంటూ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. మహిళలపై లైంగిక వేధింపులు ఆగాలంటే మరింత కఠిన చట్టాలు అమలు కావాలని సామాజిక ఉద్యమ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -