ప్రపంచంలోనే అత్యంత భారీకాయురాలు ఎమాన్ అహ్మద్ కన్నుమూశారు. 37 ఏళ్ల ఇమాన్.. పలు గుండె సంబంధిత వ్యాధులు, కిడ్నీలు పనిచేయకపోవడంతో మృతి చెందినట్లు అబుదాబిలోని బుర్జీల్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.
ముంబయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు సగం బరువు తగ్గిన ఎమాన్ తనంతట తానే తినగలిగే స్థితికి చేరిందని గతంలో వైద్యులు తెలిపారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స నిమిత్తం జూన్‌లో అబుదాబికి తరలించారు. కొంతకాలంలో పూర్తిగా కోలుకుంటుంది అనుకునేలోపే కన్నుమూసింది.
ఆమెకు 20 మంది వరకు స్పెషలిస్ట్ డాక్టర్లు చికిత్స నిర్వహించినట్లు బుర్జీల్ హాస్పిటల్ తెలిపింది. బరువు తగ్గించుకునేందుకు ఈజిప్ట్ నుంచి గత ఫిబ్రవరిలో ఇండియాకు వచ్చిన ఆమె.. వివాదాస్పద పరిస్థితుల్లో చికిత్స కోసం దేశం విడిచి యూఏఈ వెళ్లిన విషయం తెలిసిందే. మే నెల నుంచి అబుదాబిలోనే చికిత్స తీసుకుంటున్నది. 500 కిలోలకుపైగా బరువుతో గత మార్చి నెలలో ముంబై వచ్చిన ఇమాన్‌కు సైఫీ హాస్పిటల్‌లో సర్జరీ చేశారు.
అయితే ఆమెకు చేసిన చికిత్స తమకు సంతృప్తి కలిగించలేదని ఇమాన్ సోదరి ఆరోపించడంతో వివాదం మొదలైంది. ఆమెను డాక్టర్లు కేవలం పబ్లిసిటీ కోసమే వాడుకుంటున్నారని ఆరోపించింది. అయితే ఆమె ఆరోపణలను ఖండించిన సైఫీ హాస్పిటల్.. తదుపరి చికిత్స కోసం ఇమాన్‌ను అబుదాబి పంపించింది. ఆమె చికిత్స కోసం ఆసుపత్రి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ఇమాన్‌కు సర్జరీ చేసిన డాక్టర్ ముఫజల్ లక్డావాలా చెప్పారు. ఆమె చికిత్సకు సుమారు రూ.3 కోట్లు ఖర్చు కాగా.. రూ.65 లక్షలు విరాళాలుగా వచ్చినట్లు ఆసుపత్రి వెల్లడించింది.