ఉద్యోగాల కల్పనలో నెంబర్‌ 1గా విద్యుత్ శాఖ

538
cm kcr
- Advertisement -

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అతి ఎక్కువ మందికి ఉద్యోగాలిచ్చిన శాఖగా విద్యుత్ శాఖ రికార్డు సృష్టించింది. ఉద్యోగాల కల్పనలో నెంబర్ వన్ శాఖగా నిలిచింది. 2014 జూన్ 2 నుంచి ఇప్పటిదాకా తెలంగాణ జెన్ కో, ట్రాన్స్ కో, డిస్కమ్ ల ద్వారా మొత్తం 34,808 మందికి ఉద్యోగాలు లభించాయి. విద్యుత్ శాఖలో మరో 2 వేల మందికి త్వరలోనే ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. గడిచిన ఐదేళ్లలో విద్యుత్ శాఖ ఏడాదికి సగటున దాదాపు ఏడు వేల మందికి ఉద్యోగాలు కల్పించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గానీ, మరే రాష్ట్రంలో గానీ ఎక్కడా విద్యుత్ శాఖలో ఇంత పెద్ద ఎత్తున నియామకాలు జరగలేదు. ఎక్కువ మందికి ఉద్యోగవకాశం కల్పించడమే కాకుండా వచ్చే రెవెన్యూలో 9 శాతం సిబ్బంది వేతనాలకు వెచ్చించి తెలంగాణ విద్యుత్ శాఖ దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉంది. మిగతా రాష్ట్రాల్లో 5 నుంచి 7 శాతం వరకు జీతభత్యాలకు చెల్లిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జరిగిన నియామకాల కన్నా, తెలంగాణ విద్యుత్ శాఖ ద్వారా జరిగిన నియామకాలే అధికం కావడం గమనార్హం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు 36,474 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో ఇప్పటిదాకా 30,786 మందికి ఉద్యోగావకాశాలు లభించాయి. మిగతావి వివిధ ప్రక్రియల్లో ఉన్నాయి. త్వరలోనే మిగిలిన 5,688 మంది నియామకం పూర్తవుతుంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 1,17,177 మందికి ఉద్యోగావకాశం లభించింది. వీటిలో విద్యుత్ శాఖలో లభించిన ఉద్యోగాలు 29 శాతం. ఇప్పటి దాకా 17,276 మందికి ఉద్యోగావకాశం కల్పించిన పోలీస్ శాఖ 14.6 శాతం ఉద్యోగాలు కల్పించి రెండో స్థానంలో నిలిచింది. 11,935 (10 శాతం) ఉద్యోగాలతో తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ మూడోస్థానంలో, 10,500 (9 శాతం) ఉద్యోగాలతో సింగరేణి సంస్థ నాలుగో స్థానంలో, 9,495 (8 శాతం) ఉద్యోగాలతో పంచాయతీ రాజ్ శాఖ ఐదో స్థానంలో నిలిచింది.

తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, సరఫరా విభాగాలను పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగానే తెలంగాణ విద్యుత్ సంస్థల్లో భారీగా నియామకాలు చేపట్టడం సాధ్యమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 7,778 మెగావాట్ల స్థాపిత విద్యుత్ అందుబాటులో ఉంటే, గడిచిన ఐదేళ్లలో 8,441 మెగావాట్లు అదనంగా అందుబాటలోకి వచ్చింది. నేడు తెలంగాణకు 16,219 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. కేవలం జెన్ కో ద్వారానే 5,880 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం తలపెట్టింది. వ్యవసాయ రంగంతో పాటు అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ అందించడంతో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ బాగా పెరిగింది. పెరిగిన డిమాండ్ కు అనుగుణంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాల్సి రావడంతో విద్యుత్ శాఖ రూ.25,661 కోట్ల వ్యయంతో కొత్త సబ్ స్టేషన్లు, ట్రాన్స్ ఫార్మర్లు, లైన్లు ఏర్పాటు చేసింది. ఈ కారణాల వల్ల తెలంగాణ విద్యుత్ సంస్థల్లో పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టాల్సి వచ్చింది. విద్యుత్ సంస్థల్లో ఎన్నో ఏళ్లుగా ఔట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న వారిని కూడా సంస్థల్లో విలీనం చేసుకోవడం కూడా నియమకాలు ఎక్కువగా జరగడానికి ఒక కారణం.

ముఖ్యమంత్రి చొరవ వల్లనే నియమకాలు: సిఎండి ప్రభాకర్ రావు

తెలంగాణ విద్యుత్ సంస్థలను బలోపేతం చేయడం ద్వారా మాత్రమే ప్రజలకు మెరుగైన సేవలు అందించడం సాధ్యమనే ముఖ్యమంత్రి నిర్ణయం ఫలితంగానే తమ సంస్థలు విజయాలు సాధిస్తున్నాయని జెన్ కో-ట్రాన్స్ కో సిఎండి డి.ప్రభాకర్ రావు అన్నారు. అన్ని శాఖల్లో కెల్లా విద్యుత్ శాఖలోనే ఎక్కువ నియామకాలు జరగడం ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ ఫలితమే అన్నారు. ప్రైవేటులో కాకుండా జెన్ కో ద్వారానే విద్యుత్ ఉత్పత్తి జరగాలని సిఎం నిర్ణయించారని, దీనివల్ల ఉత్పత్తి ప్లాంట్లలో పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టామన్నారు. ఉద్యోగ భద్రత లేకుండా, ఏజన్సీల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడిన 22,637 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను సంస్థలో విలీనం చేసుకోవాలనే మానవతా నిర్ణయం కూడా సిఎం కేసీఆర్ దే అని సిఎండి చెప్పారు. వారి సర్వీసు నిబంధనలను కూడా హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందిస్తున్నట్లు సిఎండి వెల్లడించారు. పెద్ద ఎత్తున నియామకాలు జరపడమే కాకుండా, కార్మికులు, ఉద్యోగుల సంక్షేమానికి కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని ప్రభాకర్ రావు వెల్లడించారు.

- Advertisement -