తిరుమలలో శ్రీవారి భక్తులను ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి చేరవేసే ఉచిత బస్సులలో (ధర్మరథాలు), భక్తుల సౌకర్యార్థం వారు దిగవలసిన ప్రాంతాలు, రాబోయే బస్ స్టాప్ లు తెలిసేలా ఎలక్ట్రానిక్ ఆటోమేటిక్ వాయిస్ అనౌన్స్ మెంట్ ఏర్పాటు చేయాలని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం టీటీడీ పరిపాలన భవనంలోని ఈవో కార్యాలయంలో రవాణా విభాగం అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, తిరుమలలో 24 గంటల పాటు ఉచిత బస్సులు భక్తులను ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి చేరవేస్తున్నాయన్నారు. అయితే ఈ బస్సులలో ప్రయాణించే భక్తులు తాము దిగవలసిన ప్రాంతాలు తెలియక ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. తాము దిగవలసిన ప్రాంతాల పేర్లను అనౌన్స్ మెంట్ల ద్వారా భక్తులకు తెలిసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
భక్తుల సౌకర్యార్థం (పిఎం – ఈ బస్ సర్వీస్ పథకం కింద) ఆర్‌టిసి సహకారంతో మరో 10 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తిరుమలలో కాలుష్యాన్ని తగ్గించే క్రమంలో యాత్రికులు, అధికారుల డీజిల్ వాహనాలను భవిష్యత్తులో సిఈఎస్ఎల్ (కన్‌వర్జన్స్ ఎనర్జి సిస్టమ్స్ లిమిటెడ్) ద్వారా ఎలక్ట్రికల్ వాహనాలను తీసుకోవాలన్నారు. తద్వారా తిరుమలలో కాలుష్యాన్ని తగ్గించవచ్చని చెప్పారు. అదేవిధంగా తిరుమలలో ఎలక్ట్రిక్ వాహనాలకు సరిపోయే విధంగా చార్జింగ్ స్టేషన్ల సంఖ్యను మరింత పెంచాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
Also Read:పాక్ పై గెలవాలంటే..అలా చేయాల్సిందే!