నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం సమన్లు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని నేషనల్ హెరాల్డ్ వ్యవహారానికి సంబంధించిన విచారణ జరుపుతున్నామని, ఈ కేసులో 2వ తేదిన తమ ముందు విచారణకు హాజరు కావాలని రాహుల్ గాంధీని ఈడీ ఆదేశించింది. అదే సమయంలో ఈ నెల 8న తమ ముందు విచారణకు హాజరుకావాలని సోనియా గాంధీని ఆ సంస్థ కోరింది.
ఈ సమన్లలో పేర్కొన్న తేదీ లోపు విచారణకు హాజరుకావాలంటూ ఈడీ పేర్కొన్నది. అయితే ఈడీ సమన్లపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. 1942లో నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను ప్రారంభించిన సమయంలో బ్రిటిషర్లు దానిని అణిచివేసేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు మోదీ ప్రభుత్వం కూడా అదే చేస్తోంది. ఇందుకోసం ఈడీని ఉపయోగిస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా తెలిపారు… సోనియా గాంధీ జూన్ 8వ తేదీన ఈడి కార్యాలయంకు వెళ్తారు. రాహుల్ గాంధీకి మాత్రం కొంత వ్యవధి కావాలని కోరుతూ దర్యాప్తు సంస్థకు కాంగ్రెస్ పార్టీ లేఖ రాస్తుంది. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు అని కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ పేర్కొన్నారు.
ఇక నేషనల్ హెరాల్డ్ పత్రిక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నడిచింది. ప్రస్తుతం ఈ పత్రికను పార్టీ మూసేసింది. అయితే ఈ సంస్థకు దేశ రాజధాని ఢిల్లీ సహా పలు ఇతర ప్రాంతాల్లో అత్యంత విలువైన ఆస్తులు ఉన్నాయి. వీటిని రాహుల్ గాంధీ తన ఖాతాలో వేసుకున్నారన్నది ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారంపై గతంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి ఢిల్లీ పాటియాలా హౌజ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా… తమ జీవిత కాలంలోనే తొలిసారి సోనియా, రాహుల్ గాంధీలు కోర్టు మెట్లెక్కారు. తాజాగా ఇదే వ్యవహారంలో వారిద్దరికీ ఈడీ సమన్లు జారీ చేయడం, విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.