పశ్చిమ బెంగాల్‌లోని ఐప్యాక్ (I-PAC) కార్యాలయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేపట్టిన సోదాలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. ఈడీ చర్యలను వ్యతిరేకిస్తూ స్వయంగా సీఎం మమతా బెనర్జీ ఐప్యాక్ కార్యాలయానికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై, ముఖ్యంగా బీజేపీ నేతలపై ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు. సాల్ట్ లేక్‌లోని ఐపాక్ కార్యాలయంలో ఈడి దాడుల తర్వాత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ I-Pac డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసానికి వెళ్ళి పరామర్శించారు.
టీఎంసీ పార్టీకి సంబంధించిన హార్డ్ డిస్క్‌లు, అభ్యర్థుల జాబితాలు సేకరించడం ఈడీ బాధ్యతేనా? లేక ఇది కేంద్ర హోంమంత్రి అమిత్ షా డ్యూటీనా? అంటూ మమతా బెనర్జీ ప్రశ్నించారు. తాము ప్రతిపక్షంలో ఉన్నామని, అందుకే కేంద్ర దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా ఉపయోగించి బీజేపీ రాజకీయంగా దాడులు చేస్తోందని ఆమె ఆరోపించారు. “నేను బీజేపీ కార్యాలయంపై దాడి చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి” అంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఈడీ సోదాల పేరిట టీఎంసీ పార్టీకి సంబంధించిన మొత్తం సమాచారాన్ని సేకరిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని మమతా బెనర్జీ అన్నారు. అలాగే బెంగాల్‌లో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) నిర్వహించి బీజేపీ ఓటర్లను తొలగించేందుకు కుట్ర చేస్తోందని ఆమె ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఇలాంటి చర్యలు ప్రజల మనోభావాలను దెబ్బతీస్తాయని చెప్పారు.
Also Read:‘జన నాయగన్’ విడుదల వాయిదా
కేంద్ర ప్రభుత్వ చర్యలను తాము భయపడబోమని, బీజేపీ రాజకీయ ప్రతీకారానికి తగిన సమాధానం ఇస్తామని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఈడీ సోదాలు బెంగాల్ రాజకీయాలను మరింత వేడెక్కించాయి.

