రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి తమ బాధ్యతలు స్వతంత్రంగా నిర్వహించాల్సిన రాజ్యాంగ పరమైన బాధ్యతలని, ఈ బాధ్యతలు నిర్వహించడాన్ని గౌరవంగా భావించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథి అన్నారు. శుక్రవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జీహెచ్ఎంసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు మరియు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో మాట్లాడుతూ.. రిటర్నింగ్ అధికారులు మరియు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా పనిచేయడం కష్టతరం ఏమీ కాదని, అందుకు సంబంధించిన నియమ నిబంధనలను పూర్తిగా ఆకళింపు చేసుకుంటే సులువుగా విధులు నిర్వహించుకోవచని తెలిపారు.
చాలా వరకు అనుభవమున్న వారినే నియమించడం జరిగిందని, చట్టంలోని నియమ నిబంధనలను క్షుణ్ణంగా ఆకళింపు చేసుకొని అవసరమైనప్పుడు గట్టిగా ఉంటూనే, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలన్నారు. నామినేషన్ల స్వీకరణ నుండి గెలిచిన అభ్యర్థిని ప్రకటించేవారకు రిటర్నింగ్ అధికారులు జాగ్రత్తగా నియమ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని, అందుకు అవసరమైన మెటీరియల్ ముందుగానే అందించడం జరుగుతుందన్నారు. రిటర్నింగ్ అధికారులు వారికి కేటాయించిన వార్డుకు సంబంధించిన హద్దులు, పోలింగ్ స్టేషన్లపై అవగాహన కలిగి ఉండాలి, పోలింగ్ స్టేషన్ భవనాలు తనిఖీ చేయాలి, పోలింగ్ నిర్వహణకు కేటాయించిన ఎన్నికల సిబ్బంది వివరాలు తెలుసుకోవాలి. మీ వార్డుకు కేటాయించబడిన ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు తగిన శిక్షణ ఇవ్వాలని, కావలసిన మెటీరియల్ ముందుగా సమకూర్చుకొని చెక్ చేసుకోవాలన్నారు.
వార్డుల వారీగా సంబంధించిన జోనల్ అధికారులు, రూట్ అధికారులు, టీంలపై అవగాహన పెంచుకోవాలని, పోస్టల్ బాలట్ ప్రతి ఉద్యోగికి అందేలా చూడాలన్నారు.అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటైన హైదరాబాద్ లో ఎన్నికల విధులు నిర్వహించడం సులువైన పనేనని, అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయన్నారు. అన్ని విధులకు సంబంధించిన మెటీరియల్ అందచేయడం జరుగుతుందని, ఇంట్రెస్ట్ తో అవగాహన చేసుకుంటే విధులు అత్యంత సులువుగా నిర్వహించవచ్చన్నారు. అంతేకాక టెక్క్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఎన్నికల ప్రక్రియ సులభతరం అవుతూవున్నదని, కంప్యూటర్లు వినియోగంలోకి వచ్చిన తరువాత వివిధ రకాల సాఫ్ట్ వేర్లు అభివృద్ధి చెంది, నామినేషన్ల నుండి రిజల్ట్స్ డిక్లేర్ చేసే వరకు మాన్యువల్ వర్క్ తగ్గిందన్నారు.
కోవిడ్ నేపథ్యంలో ప్రతి స్టేజ్ లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ప్రతిఒక్కరు మాస్కు ధరించేలా, భౌతిక దూరం పాటించేలా, సానిటైజర్లు ఉపయోగించేలా చూడాలన్నారు. ఈ సారి ఎన్నికలలో ప్రయోగాత్మకంగా ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ అమలుచేస్తున్నామని, ప్రతి వార్డులో విశాలంగా, ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ఒక పోలింగ్ స్టేషన్‌లో ఈ టెక్నాలజీ అమలు చేయబడుతుందని తెలిపారు.
జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ మాట్లాడుతూ.. రాబోవు జీహెచ్ఎంసీ ఎన్నికలను నిర్వహించే విషయంలో జీహెచ్ఎంసీ సిబ్బంది తమ వంతు సహాయ సహకారాలను అందిస్తారని అలాగే రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు ఎటువంటి సందేహాలనైనా సంబంధిత సిబ్బందితో సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు, సుమారు 450 మంది రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.