గ్రేటర్ హైదరాబాద్‌లో నిబంధనలకు వ్యతిరేకంగా భవన నిర్మాణ వ్యర్థాల పారవేత, చెత్తను రోడ్డుపై వేయడం, అక్రమంగా బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తదితర స్వచ్ఛ ఉల్లంఘనులకు ఇ-ఛలాన్ ద్వారా పెనాల్టీలు విధించే మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్‌గా జిహెచ్ఎంసి నిలిచింది. అధికారులు, సిబ్బంది నేరుగా ప్రమేయం లేకుండా కేవలం నిబంధనల అతిక్రమణల ప్రాతిపదికగా ఆటోమెటిక్‌గా ఇ-ఛలాన్లను జనరేట్‌చేయడం ద్వారా జిహెచ్ఎంసి సెంట్రల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం దేశంలోనే సాంకేతిక విధానాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకునే కార్పొరేషన్‌గా ఘనత సాధించిందని నగర మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు.
సికింద్రాబాద్ బుద్దభవన్‌లోని జిహెచ్ఎంసి ఇ.వి.డి.ఎం కార్యాలయంలో డైరెక్టర్ విశ్వజిత్ కంపాటితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సెంట్రల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్ ద్వారా నగరంలో వివిధ విభాగాల్లో చేసిన ఉల్లంఘనలకు 1,084 మందికి రూ. 1.50 కోట్లను జరిమానాగా విధించినట్టు పేర్కొన్నారు. ఈ కోటిన్నర జరిమానాల్లో రూ. 18.50 లక్షలను బ్యాంకుల ద్వారా జరిమానాలను స్వచ్ఛందంగా చెల్లించారని పేర్కొన్నారు. నగరంలో జరిగే ఉల్లంఘనలకు సంబంధించి జరిమానాలు వేసేందుకుగాను జిహెచ్ఎంసికి చెందిన 24 విభాగాలు కేవలం ఫోటో, వీడియోతీసి అప్‌లోడ్ చేస్తాయని, దీంతో ఆయా ఉల్లంఘనకు సంబంధించి జరిమానా నమోదు అవుతుందని స్పష్టం చేశారు. ప్రతి ఛలాన్ జనరేట్‌కు క్యూ.ఆర్ కోడ్ ఉంటుందని తెలిపారు.
ఈ విధానం ద్వారా ఛలాన్ల విధింపులో ఏవిధమైన అవకతవకలుగాని, అవినీతికిగాని ఆస్కారంలేదని పేర్కొన్నారు. అదేవిధంగా ఒకసారి ఇ-ఛలాన్ జనరేట్ అయితే దీనిని ఎవరూ మార్చే అవకాశంలేదని, తప్పనిసరిగా జరిమానాను చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నగరవాసులపై అనవసరంగా జరిమానాలు విధించాలనేది తమ ఉద్దేశం కాదని, కేవలం స్వచ్ఛత అంశాలపై నగరవాసుల్లో బాధ్యతాయుత మార్పు తేవడమే తమ లక్ష్యమని బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. దేశంలోని ఇతర మెట్రో నగరాలను పోల్చిచూస్తే హైదరాబాద్‌లో జరిమానాలు అతితక్కువగా ఉన్నాయని అన్నారు. నగరంలో అగ్నిప్రమాద నివారణ పరికరాలను ఏర్పాటుచేయాలని కోరుతూ పబ్‌లు, బార్‌లు, పాఠశాలలు, ఆసుపత్రులు, కోచింగ్ సెంటర్లకు నోటీసులు జారీచేశామని వెల్లడించారు. ఈ నెల 20 నుండి 29వ తేదీ వరకు భవన నిర్మాణ వ్యర్థాల సేకరణ డ్రైవ్‌ను చేపడుతున్నామని తెలిపారు.