స్టైలిష్‌స్టార్ అల్లు అర్జన్ చేసే ప్రయత్నాలు చూస్తుంటే..మెగా హీరోలందరిలో తాను డిఫెరెంట్ అన్న మాటలు నిజమే అనిపించక తప్పదు. బన్ని చేసే ప్రయత్నాలేంటి? అసలు ఆయన ఎందుకు డిఫెరెంట్ ? అనే విషయానికొస్తే..గత కొన్నేళ్లలో ఇంతింతై అన్నట్లు ఎదిగిపోయిన అల్లు అర్జున్ తనకంటూ ఒక ఇమేజ్ ని సంపాధించుకున్నాడు. అందుకే బన్నీ సినిమాల ప్లానింగ్, వాటి ప్రమోషన్, ఈ విషయాలన్నీ కూడా డిఫరెంటుగా ఉంటున్నాయి.
మొదటినుంచి మెగా నీడలోనే బతుకుతున్నాం అని చెప్పిన బన్నీ.. ఇప్పుడు తనకంటూ ఓ ప్రత్యేకత కావాలనుకున్నాడో ఏమోగానీ తాను చేసే పనులు కాస్త డిఫెరెంట్ గానే ఉన్నాయి. కొన్నాళ్ల కిందటి వరకు పవన్ కళ్యాణ్‌ను మినహాయిస్తే.. మెగా ఫ్యామిలీ హీరోలందరికీ ఒకే పీఆర్వో టీం ఉండేది. కానీ ‘ధృవ’ సినిమాకు చరణ్ వేరే పీఆర్వోను పెట్టుకున్నాడు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అదే బాటలో వెళ్తూ తనకంటూ ఒక స్పెషల్ పీఆర్వో టీం పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది.
‘దువ్వాడ జగన్నాథం’ ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన సందర్భంగా జరిగిన హంగామా.. బన్నీ ప్రత్యేకతను చాటడానికి అతడి టీం.. అభిమాన సంఘాలు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మామూలుగా బన్నీ సినిమాలకు సంబంధించి ఏదైనా విశేషం బయటికి వస్తే.. దానికి సంబంధించిన ప్రమోషన్ చేస్తూ చిరంజీవితో పాటు మిగతా మెగా హీరోల ప్రస్తావన కూడా ఉంటుంది. కానీ ‘దువ్వాడ జగన్నాథం’ విషయంలో అందుకు భిన్నంగా జరిగింది. అల్లు అర్జున్ అంటేనే ఒక బ్రాండ్, అతనే ఒక సూపర్ స్టార్ అన్నట్లుగా అతడి పీఆర్ టీం.. అభిమానులు ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు.
ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో, అటు కర్ణాటకలో కూడా బన్నికి ఎంత ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పడు అదే విషయాన్ని చూపిస్తూ ఫస్ట్ లుక్ లాంచ్‌కు సంబంధించి ఫ్లెక్సీలు తయారు చేస్తుండటం, వాహనాలపై ‘డీజే’ లుక్ ప్రింట్ చేయడం.. ఇలా ఆ హంగామానంతా ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే బన్నీ మెగా ఫ్యామిలీ నుంచి వేరు అవుతున్నాడు అని వస్తున్న వార్తలు నిజమేనేమో అన్న సందేహాలకు మరింత బలం చేకూరుతుంది. ఓవైపు చిరంజీవిని వీలు చిక్కినపుడల్లా పొగిడేస్తూనే.. బన్నీ తన ఇమేజ్ పెంచుకునే ప్రణాళికను సమర్థంగానే అమలు చేస్తున్నాడనే అనుకోవాలా అనే ఆలోచనకు వస్తున్నారు సినీ ప్రేక్షకులు.