మరికొద్ది రోజుల్లో దుబ్బాక శాసన సభ స్థానానికి జరుగనున్న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్ నుండి టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ నేతలు నర్సింహారెడ్డి, మనోహర్‌రావు పార్టీకి షాక్ ఇచ్చారు. మంత్రి హరీష్ రావు సమక్షంలో నేడు అధికార పార్టీలో చేరారు. సుమారు రెండు వేల మంది అనుచరులతో భారీ ర్యాలీతో వచ్చి టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరిని మంత్రి హరీష్ రావు గులాబి కండువాలు కప్పి పార్టీలో కి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు భారీ మద్దతు వస్తుందని తెలిపారు. ఈ మద్దతు చూస్తుంటే సుజాత భారీ మెజార్టీతో గెలుస్తుందన్న విశ్వాసం ఉందన్నారు. ఎన్నికల వరకే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ ఉంటాడు. కానీ తాము 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు. కేవలం ఓట్ల కోసమే వచ్చే వాళ్లకు ఓట్లు వేద్దామా? ఇక్కడి ప్రజలతో కష్టసుఖాలు పాలు పంచుకునే వారికి ఓటేద్దామా? అని అడిగారు.
గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు కూడా వస్తాయో.. రావో అని కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారు. పోటీకి సోలిపేట సుజాత అసమర్థురాలు అని ఉత్తమ్ మాట్లాడటం సరికాదన్నారు. దుబ్బాక మహిళా లోకాన్ని ఉత్తమ్ కించపరిచాడని ధ్వజమెత్తారు. తొలిసారి దుబ్బాక నియోజకవర్గానికి మహిళా ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించబోతుందని అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని మంత్రి హరీష్ రావు తెలిపారు.