డిఫరెంట్ మూవీస్‌తో తమిళంలో వరుస విజయాలో దూసుకెళ్తున్న హీరో విజయ్ సేతుపతి `పిజ్జా` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. విజయ్ సేతుపతి కథానాయకుడుగా శీను రామసామి దర్శకత్వంలో రూపొందిన `ధర్మదొరై` చిత్రం ..తమిళంలో ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో సుధా సినిమాస్ బ్యానర్‌పై జె.సాంబశివరావు నిర్మాతగా `డా.ధర్మరాజు ఎం.బి.బి.ఎస్.` పేరుతో విడుదల చేస్తున్నారు.
పవిత్రమైన డాక్టరు వృత్తిలోని ఓ యువకుడు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు. ఆ సమస్యలను ఎలా అధిగమించాడు అనేదే సినిమా కథ. స్టార్ హీరోయిన్, మిల్కీ బ్యూటీ తమన్నా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. తమిళంలో సెన్సేషనల్ విజయాన్ని సాధించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి తల్లి పాత్రలో సీనియర్ నటి రాధిక నటించడం విశేషం. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించాడు. బిచ్చగాడు వంటి సెన్సేషన్ చిత్రానికి మాటలు పాటలు అందించిన భాష్యశ్రీ ఈ చిత్రానికి మాటలు, పాటలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఆడియో విడుదల చేసి, సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని నిర్మాత జె.సాంబశివరావు తెలియజేశారు.
విజయ్ సేతుపతి, తమన్నా, రాధిక, ఐశ్వర్య రాజేష్, సృష్టి డాంగే తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతంః యువన్‌శంకర్ రాజా, సినిమాటోగ్రఫీః ఎం.సుకుమార్, ఎడిటింగ్ః కాశీవిశ్వనాథ్, నిర్మాతః జె.సాంబశివరావు, దర్శకత్వంః శీను రామసామి.