చదువు కోవాల్సిన సమయంలో మెదడు నిండా చెడు ఆలోచనలను నింపుకుని విద్యను నిర్లక్ష్యం చేస్తే జీవితం అంధకారం అవుతుందని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి విద్యార్థులను హెచ్చరించారు. బిడ్డల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాలని తల్లిదండ్రులు ఎన్నో కలలుకని కష్టపడతారని ఆయన చెప్పారు. తల్లిదండ్రుల కలలు నెరవేర్చడానికి తాము ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నామని ప్రతి విద్యార్థి ప్రతి రోజు మననం చేసుకోవాలని ఆయన కోరారు.
శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల 79వ విద్యార్ధి సంఘం ప్రారంభోత్సవం గురువారం సాయంత్రం జరిగింది. చైర్మన్ కరుణాకర రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అథితి గా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు తమను తాము తీర్చి దిద్దుకోవడానికి, పాడు చేసుకోవడానికి కళాశాల చదివే వయసు ఉపయోగపడుతుందన్నారు. డిగ్రీ అయ్యాక మరో మూడేళ్ళు కష్టపడి బాగా చదివితే 70 ఏళ్ళు బాగా జీవించవచ్చని చెప్పారు. చదువు వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దే ఆయుధమని, విద్యార్థులు పాఠ్య పుస్తకాలతో పాటు జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు కూడా బాగా చదవాలన్నారు. కాలం చాలా విలువైనదని, దుర్వినియోగం చేసుకుంటే జీవితం ఎగతాళి అవుతుందనే విషయం గుర్తు పెట్టుకోవాలని శ్రీ కరుణాకర రెడ్డి విద్యార్థులకు సూచించారు.
తాను 1977లో ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో చదివే రోజుల్లో విద్యార్ధి సంఘం నాయకుడిగా అనేక కార్యక్రమాలు నిర్వహించానన్నారు. తనకు విద్య, నడత, జ్ఞానం నేర్పించిన గురువులను ఆయన స్మరించుకున్నారు. కళాశాలలో ఎన్నో పోరాటాలు చేసినా చదువును మాత్రం విస్మరించలేదన్నారు. తరగతులు ఎగ్గొట్టే వాడిని కాదనీ, లైబ్రరీలో కూడా ఎక్కువకాలం గడిపే వాడినని తన జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. విద్యార్ధి సంఘం నాయకుడిగా శ్రీశ్రీ, , త్రిపురనేని మహారథి లాంటి అనేక మంది ప్రముఖులను పిలిపించి విద్యార్థులకు ఉపయోగపడే ప్రసంగాలు ఇప్పించానని చెప్పారు.
Also Read:లక్ష్మీ పార్వతి ఓకే.. మరి బాలకృష్ణ ఏమిటి?