మన రోజువారీ దినచర్యలో టైమ్ కి భోజనం చేయడం చాలా అవసరం. టైమ్ కి భోజనం చేయడం వల్ల శరీరానికి అందవలసిన శక్తి సరైన సమయంలో అందుతుంది. అంతే కాకుండా శరీరంలోని అన్నీ భాగాలు కూడా చురుకుగా పని చేయడానికి కూడా టైమ్ కి భోజనం చేయడం ఎంతో ముఖ్యం. అలా చేయకపోవడం వల్ల గ్యాస్ సమస్యలు తలెత్తడంతో పాటు అజీర్తి వంటి సమస్యలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఇదిలా ఉంచితే భోజనం చేసిన తరువాత అలాగే భోజనం చేసే ముందు కొందరు కొన్ని అలవాట్లను కల్గి ఉంటారు. వాటి వల్ల ఆరోగ్య పరంగా సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఆ అలవాట్లు వాటి వల్ల ఏర్పడే సమస్యల గురించి తెలుసుకుందాం !
సాధారణంగా కొంత మంది భోజనం చేసే ముందు మరియు భోజనం చేసిన తరువాత అధిక మొత్తంలో నీటిని తాగుతుంటారు.. ఇలా చేయడం మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. భోజన సమయంలో నీటిని ఎక్కువగా సేవిస్తే జీర్ణ ప్రక్రియకు అంతరాయం ఏర్పడుతుందట. అందువల్ల భోజనం చేసే ముందు గాని, భోజనం చేసిన తర్వాత గాని నీటిని తాగరదని, కనీసం ఒక గంట నుంచి రెండు గంటల వ్యవధిలో నీటిని తాగాలని చెబుతున్నారు నిపుణులు.
ఇక చాలమందికి తిన్న వెంటనే వాకింగ్ చేయడం అలవాటుగా ఉంటుంది. ఇలా చేయడం కూడా మంచిది కాదట. తిన్న వెంటనే కాస్త విశ్రాంతి ఇచ్చి ఆ తర్వాత వాకింగ్ చేస్తే ఆహారం తేలికగా జీర్ణం అవుతుందట. ఇక చాలమంది రాత్రి పూట లేటుగా భోజనం చేసి, తిన్న వెంటనే నిద్ర పోతారు. అయితే ఇలా చేయడం కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం అవ్వక, నిద్ర లేమి సమస్య ఏర్పడుతుందట. అందువల్ల రాత్రిపూట భోజనానికి, పడుకోవడానికి కనీసం 3 గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి.
ఇక భోజనం చేసిన వెంటనే కొందరు టీ తాగుతుంటారు. ఇలా చేయడం కూడా మంచిది కాదట. తిన్న వెంటనే టీ తాగడం వల్ల టీ లోని కేఫైన్ ఆహారాన్ని జీర్ణం కాకుండా చేస్తుంది. అందువల్ల జీర్ణ క్రియ సమస్యలు ఏర్పడతాయి. ఇలాంటి అలవాట్లు ఉంటే మార్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..