KBR పార్క్ పరిసరాల్లో చెట్లు నరికివేత..సుప్రీం స్టే

4
- Advertisement -

నగరంలోని ప్రముఖ కాసు బ్రహ్మానందరెడ్డి (KBR) జాతీయ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై గౌరవ సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పార్క్ చుట్టుపక్కల చెట్లను నరకడంపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న 25 నుండి 30 మీటర్ల ఎకో సెన్సిటివ్ జోన్ (Eco-Sensitive Zone) పరిధిలో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి చెట్లను నరకకూడదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను ధర్మాసనం జూలై 27వ తేదీకి వాయిదా వేసింది.

ఈ విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కె. వివేక్ రెడ్డి తన వాదనలను వినిపించారు.ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఎకో సెన్సిటివ్ జోన్ విస్తీర్ణతను తగ్గిస్తోంది. అంతేకాకుండా, హైకోర్టు సెలవులను అదునుగా తీసుకుని ఇష్టానుసారంగా చెట్లను నరికివేస్తోంది అని న్యాయవాది వివేక్ రెడ్డి సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

న్యాయవాది వాదనలను పరిగణనలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని జూలై 27 వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. ఈ స్టే ఉత్తర్వులతో పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read:చైనాలో పుతిన్ పర్యటన

- Advertisement -