కిమ్‌తో భేటీకి ట్రంప్ గ్రీన్ సిగ్నల్..

193
trump and Kim

అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బద్దశత్రువుల భేటీకి ముహుర్తం ఖరారైంది. ఈ నెల 12న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్,ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్ ఉన్‌లు భేటీ కానున్నారు. ఇందుకు సింగపూర్ వేదిక కానుంది. ఉదయం 9 గంటలకు ఇరువురు నేతలు భేటీ కానున్నట్లు శ్వేతసౌధం ప్రకటించింది.

ట్రంప్‌, కిమ్ సమావేశం నేపథ్యంలో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. వీరివురు బస చేసే హోటల్‌, ప్రయాణించే రోడ్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. సింగపూర్‌ పోలీసులతో పాటు గూర్ఖాలు కూడా ఈ భద్రతా చర్యల్లో పాల్గొంటున్నట్లు సమాచారం.

ప్రపంచంలోనే అత్యంత సాహస యోధుల తెగల్లో గూర్ఖా కూడా ఒకటి. నేపాల్‌లోని కొండల ప్రాంతాలకు చెందిన గూర్ఖాలను సింగపూర్‌ పోలీసులు ప్రత్యేకంగా నియమించుకున్నారు. కాంబాట్‌ తుపాకులు, పిస్టోళ్లు ధరించిన ఈ గూర్ఖాలు దేశంలో ముఖ్యమైన సమావేశాలు జరిగినప్పుడు భద్రతా చర్యల్లో పాల్గొంటారు.

ఉత్తర కొరియా అణ్వస్త్ర రహితంగా మారేందుకు చర్యలు ప్రారంభిస్తే కిమ్ తో  భేటీ అవుతానని గతంలో ట్రంప్‌ చెప్పారు. అయితే ట్రంప్ ఈ భేటీని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. దీంతో వీరి సమావేశంపై నీలినీడలు కమ్ముకున్నాయి. తాజాగా నార్త్ కొరియా విదేశీ వ్యవహారాల మంత్రితో సమావేశం అనంతరం ట్రంప్ తన మనసును మార్చుకున్నారు.