రాష్ట్ర విద్యుత్ శాఖ సిబ్బంది, అధికారులపై పోలీసులు దాడి చేస్తున్నట్లు వార్తలు రావడంపై ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు స్పందించారు. తెలంగాణలో లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో హాస్పిటల్స్, వినియోగదారులకు నిరంతరం విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్ శాఖ ఉద్యోగులు, సిబ్బంది 24 గంటలు పని చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. నల్లగొండ, హైదరాబాద్‌లో విద్యుత్ శాఖ సిబ్బంది, అధికారులపై పోలీసులు దాడి చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు.
విద్యుత్ శాఖ సిబ్బంది, అధికారుల వాహనాలను ఆపొద్దు, సీజ్ చేయొద్దని పోలీసు ఉన్నతాధికారులకు ప్రభాకర్ రావు విజ్ఞప్తి చేశారు. తమ డిపార్ట్‌మెంట్ ఐడీ కార్డు, సంబంధిత పాస్ చూపిస్తే వదిలేయాలని కోరారు. తమ శాఖ అధికారులకు, సిబ్బందికి లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఉందని ప్రభాకర్ రావు స్పష్టం చేశారు.