వాయిదా తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా తమిళనాడు అసెంబ్లీలో రచ్చ కొనసాగింది. డీఎంకే ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం ముందు ఆందోళనకు దిగారు. దాంతో సభ మూడు గంటల వరకు వాయిదా వేశారు. తనపై దాడికి ప్రయత్నించడంతో పాటూ, సభా మర్యాదను మంటగలిపేలా సభ్యులు ప్రవర్తించారని స్పీకర్ ధన్ పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. డీఎంకే సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేసిన ఆయన, వారిని వెంటనే సభ నుంచి బయటకు పంపించాలని ఆదేశించారు. అయితే సభ్యులను బయటకు పంపేందుకు ప్రయత్నించిన మార్షల్స్ పై కూడా డీఎంకే ఎమ్మెల్యేలు దాడికి ప్రయత్నించారు. దాంతో వారి మధ్య తోపులాట జరిగింది.
తమిళనాడు అసెంబ్లీలో విశ్వాస పరీక్ష రచ్చ రచ్చైంది. రహస్య ఓటింగ్ కు పట్టుబడుతూ డీఎంకే, కాంగ్రెస్, పన్నీర్ సెల్వం వర్గాలు బీభత్సం సృష్టించాయి. మైకులు, కుర్చీలు విరిచేసిన సభ్యులు, స్పీకర్ కుర్చీని కూడా వదల్లేదు. ఒకానొక సమయంలో స్పీకర్ పై దాడికి కూడా సభ్యులు వెనుకాడలేదు. అంతేకాదు పలువురు ఎమ్మెల్యేలు బెంచీలపై ఎక్కి, బీభత్సం సృష్టించారు. డీఎంకే ఎమ్మెల్యే కుకా సెల్వం స్పీకర్ కుర్చీలో కూర్చొని నిరసన తెలిపారు. మరోవైపు మహిళా ఎమ్మెల్యే అలాడి అరుణ కుర్చి ఎక్కి నిరసన తెలిపారు. ఓటింగ్ కు అందరూ సహకరించాలని స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ సభ్యులు వినలేదు. ఎమ్మెల్యేల బీభత్సంలో అసెంబ్లీ సిబ్బంది గాయపడ్డారు. దాంతో వారిని అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. మరోవైపు అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేయడంతో పాటూ, తలుపులు కూడా మూసివేశారు. దీంతో లోపల ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి. అసెంబ్లీ పరిసర ప్రాంతాలకు మీడియాను అనుమతించలేదు. కనీసం లోపలి ఆడియో కూడా వినిబడకుండా వైర్లు కట్ చేశారు.