నెగెటివ్ టాక్, ప్రతికల రివ్యూలు తట్టుకొని కూడా దువ్వాడ జగన్నాదం సినిమా వసూళ్లలో దూసుకుపోతుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన ట్యూబ్‌లైట్ చిత్రాన్ని తలదన్నేలా వసూళ్లను సాధిస్తున్నది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఈ సినిమా తొలి వారంతంలోనే రూ. 100 కోట్ల వసూళ్లు సాధించింది.
ఈ సందర్భంగా ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు, అభిమానులకు దర్శకుడు హరీష్ శంకర్ తనదైన శైలిలో కృతజ్ఞతలు తెలిపాడు. “వంద కోట్ల సినిమా ఇచ్చిన సభ్య సమాజానికి శత కోటి వందనాలు” అంటూ ట్వీట్ చేశాడు. కలెక్షన్లకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపాడు.
తొలుత ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చినా ప్రేక్షకులు ఆదరిచడంతో చిత్రం సఫలమైంది. రిలీజ్ రోజున డీజే చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.33 కోట్లు వసూలు చేసింది. అదే జోష్‌ను కొనసాగిస్తూ ఐదో రోజుకు రూ.82 కోట్ల వసూళ్లను కొల్లగొట్టింది. డీజే సాధిస్తున్న కలెక్షన్లు బాలీవుడ్ సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. వసూళ్లపరంగా దూసుకెళ్తున్న దువ్వాడ జగన్నాథంపై పైరసీ ప్రభావం పెద్దగా లేదని చెప్పాలి. సినిమా ఇప్పటికే ఆన్‌లైన్‌లోకి వచ్చేసినా.. ప్రేక్షకులు థియేటర్లకు భారీగా తరలిరావడంతో దాని ప్రభావం డీజేపై పడకపోవడం గమనించదగినది.