దీపావళి సందర్భంగా బుధవారం సాయంత్రం అయోధ్య నగరంలో 1.87 లక్షల మట్టి ప్రమిదలతో దీపాలు వెలిగించి ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం గిన్నీస్ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం సరయూ ఘాట్‌లో 14 వేల లీటర్ల నూనెను ఉపయోగించారు.
ఇంతవరకు బాగానే ఎన్న ఆ మర్నాడు ఘాట్‌లో చోటుచేసుకున్న పరిస్థితులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వెలిగించిన దీపాలు ఆరిపోయిన తరువాత ఆ ప్రమిదల్లో కొంత నూనె అలానే మిగిలి ఉంది. ఈ నూనెను సేకరించేందుకు మహిళలు, పిల్లలు పోటీ పడ్డారు. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
2016 సెప్టెంబర్ 23న సిర్సాలోని డేరా సమీపంలో డేరా బాబా 1,50,009 దీపాలు వెలిగించి గిన్నీస్ రికార్డు సృష్టించారు. అయోధ్య దివ్య దీప్ ఉత్సవాల్లో భాగంగా గుర్మీత్ రికార్డును బ్రేక్ చేసేందుకు యోగి ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. ఓ పక్క గోరఖ్‌పూర్ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక ఎందరో చిన్నారులు మృత్యువాతపడుతుంటే ఇప్పుడు ఈ గిన్నీస్ రికార్డులు అవసరమా అని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి.