సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘బాహుబలి: ది కంక్లూజన్’ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అన్ని చోట్ల నుంచి మంచి రిపోర్టులే వస్తున్నాయి. విజువల్ గ్రాండియర్ విషయంలో బాహుబలి1 స్థాయిని అందుకోలేదనే విమర్శలు ఉన్నా.. మొత్తంగా కథకు ప్రాధాన్యత ఇవ్వడంతో.. సినిమాపై సంతృప్తిగానే ఉన్నారు ఆడియన్స్. కానీ విడుదల విషయంలో యూనిట్ ఇంత సుదీర్ఘమైన టైమ్ తీసుకున్నా.. చివరకు కొన్ని తప్పిదాలు మాత్రం తప్పలేదు.అయినా ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సినిమా చూసినవారంతా అద్భుతంగా ఉందని చెబుతున్నారు. భావోద్వేగాలు చాలా బాగా పండాయని అంటున్నారు.
హైద్రాబాద్ లోని ఓ మల్టీప్లెక్స్ లో తెలుగు వెర్షన్ కోసం వెళ్లిన ఆడియన్స్ కు హిందీ వెర్షన్ చూపించారు. జనాలు అరిచి గోల చేయడంతో.. తిరిగి తెలుగు వెర్షన్ మొదలుపెట్టారు. బెంగళూరులో అయితే.. సెకండాఫ్ నుంచి సినిమా స్టార్ట్ చేసి చూపించారు. క్లైమాక్స్ అయిపోయాక కానీ విషయం అర్ధం కాలేదు. ఆడియన్స్ గగ్గోలు పెట్టడంతో మళ్లీ సినిమా మొత్తం వేయాల్సి వచ్చింది. యూఏఈలో కూడా తెలుగు వెర్షన్ కు బదులు హిందీ బాహుబలి2ను ఓ థియేటర్లో 30 నిమిషాల పాటు చూపించారు. ఆ తర్వాత మళ్లీ మొదలుపెట్టాల్సి వచ్చింది.
తమిళనాడులో అయితే.. నిర్మాత- డిస్ట్రిబ్యూటర్ల మధ్య డీల్ సెట్ కాకపోవడంతో.. గురువారం ప్రీమియర్స్.. శుక్రవారం మాణింగ్ షోస్ పడలేదు. అప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో టికెట్స్ విక్రయించేయడంతో.. జనాలు తిట్టిపోస్తున్నారు. ఇది తమిళనాడు కలెక్షన్స్ పై కూడా ప్రభావం చూపనుంది. కొచ్చిలో డిస్ట్రిబ్యూటర్లు- ఎగ్జిబిటర్ల మధ్య రెవెన్యూ షేరింగ్ పై ఒప్పందం కుదరకపోవడంతో.. పలు మల్టీప్లెక్స్ లలో బాహుబలి2 ప్రదర్శించలేదు. పోస్ట్ ప్రొడక్షన్ పనులకే దాదాపు ఆరు నెలలు టైం కేటాయించినా.. ఇలాంటి సమస్యలు రావడం ఆశ్చర్యకరమే.