మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా పూరి డైరెక్షన్లో వచ్చిన చిత్రం ‘లోఫర్’. ఈ చిత్రంలో తన నాజూకు అందంతో యువతను మంత్రముగ్దుల్ని చేసిన హీరోయిన్ దిశా పఠాని. ఈ సినిమాతో తెలుగులో భారీ హిట్ కొట్టాలనుకుంది ఈ బ్యూటీ. కానీ ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై ఫ్లాప్‌ను మూటగట్టుకోవడంతో ఈ అమ్మడు ఆశలు నిరాశలయ్యాయి.
ఆ తర్వాత తెలుగు, తమిళ్ సినీ పరిశ్రమల నుంచి ఆఫర్లు రాకపోవడంతో బాలీవుడ్ బాట పట్టింది దిశా. అక్కడ అడుగుపెట్టిన కొద్ది రోజులకే ‘భాగీ2’ సినిమా చేసే అవకాశం వచ్చింది. ఈ సినిమా విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసుకోవడంతో స్టార్ హీరోలతో నటించే అవకాశాలపై దృష్టి పెట్టింది.
ఆ ప్రయత్నాల్లో భాగంగానే సల్మాన్ ఖాన్ సరసన నటించే ఛాన్స్‌ను కూడా కొట్టేసినట్లు సమాచారం. ఇక తాజా సమాచారం ప్రకారం హృతిక్ రోషన్ సినిమాలో నటించే అవకాశాన్నికూడా ఒడిసిపట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రోహిత్ ధావన్ దర్శకుడి వ్యవహరించనున్న ఈ చిత్రాన్ని సాజిద్ నడియడ్ వాలా నిర్మించనున్నారు. ఇలా బాలీవుడ్ నుంచి ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు క్యూ కట్టడంతో ఖాళీ లేకుండా సినిమాలు చేస్తుందట.