జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ స్థానానికి ఈనెల 12న జరగనున్న ఉప ఎన్నిక నిలిచిపోనుందా? తాజా పరిణామాలను బట్టి చూస్తే అవుననే అనిపిస్తోంది. ఉప ఎన్నిక సందర్భంగా కోట్లాది రూపాయలు ఓటర్లకు పంచినట్టు గుర్తించిన ఎన్నికల సంఘం ఉప ఎన్నికను నిలిపివేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్కేనగర్‌లో పారుతున్న ధనప్రవాహంపై రాష్ట్ర ఎన్నికల సంఘంతోపాటు ఆదాయపన్ను శాఖ కూడా సీఈసీకి నివేదిక సమర్పించినట్టు సమాచారం.
తమిళనాడు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్‌పై నిర్వహించిన ఐటీదాడుల్లో కీలక విషయాలు బయటపడ్డాయి. ఆర్కేనగర్ ఉపఎన్నికలో అన్నాడీఎంకే అభ్యర్థి దినకరన్ గెలుపు కోసం ఓట్లను కొనుగోలు చేసేందుకు రూ.89కోట్లు మళ్లించినట్లు తేలింది. ఈ డబ్బు ఇప్పటికే క్షేత్రస్థాయికి పంపించేశారు.తమిళనాడులోని ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో కోట్లాది రూపాయల ధనప్రవాహాన్ని జాతీయ ఎన్నికల సంఘం గుర్తించింది.
తమిళనాడు మంత్రి నివాసం నుంచి ఆర్కేనగర్ కు వెళ్లిన వంద కోట్ల రూపాయలు ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో పంపణీకి వెళ్లినట్టు గుర్తించారు. 2 లక్షల మంది ఓటర్లకు ఓటుకు సుమారు నాలుగు వేల రూపాయల చొప్పున పంపిణీ చేసినట్టు ఎన్నికల సంఘం గుర్తించింది. మరోవైపు ఇతర పార్టీలు కూడా భారీ మొత్తంలో డబ్బు పంపిణీ చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తించింది. దీంతో ఈ నెల 12న ఎన్నికల నిర్వహణ నిలిపివేయాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఈసీ నుంచి అధికారికంగా ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన రాలేదు.