రీల్‌ లైఫ్‌లో హీరో…రియల్‌ లైఫ్‌లో విలన్

223
Dileep Arrested in Actress abduction case
- Advertisement -

ప్రముఖ సినీ నటి భావన లైంగిక వేధింపుల కేసు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. ఈ కేసులో పల్సర్ సునీని అదుపులోకి తీసుకున్న పోలీసులు రెండు వారాల క్రితం ప్రముఖ మలయాళ నటుడు దిలీప్ ను విచారించారు.  అనంతరం నిన్న పోలీసులు దిలీప్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కేసు చిక్కుముడి దాదాపుగా వీడినట్లైంది. ఫిబ్రవరి 17న సినిమా షూటింగ్ ముగించుకున్న భావనను డ్రైవర్ పల్సర్ సునీ కిడ్నాప్ చేసి, కార్పొరేటర్ ఇంటికి తీసుకెళ్లి అసభ్య రీతిలో వీడియో తీసి లైంగికంగా వేధించిన సంగతి తెలిసిందే.

అప్పటినుంచి రోజుకో మలుపు తిరిగిన ఈ కేసులో తాజాగా మలయాళ స్టార్ హీరో పాత్ర ఉందని తేలడం అంతా అవాక్కయ్యారు. వాస్తవానికి భావన లైంగిక వేధింపుల ఘటనకు దిలీప్ వివాహం నాడే స్కెచ్ రెడీ అయిందని పోలీసులు గుర్తించారు. 24 నవంబర్ 2016లో దిలీప్, కావ్య మాధవన్ ల వివాహం జరిగింది. ఆ వివాహాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన భావన…. దానికి హాజరు కాలేదు సరికదా, తీవ్ర వ్యాఖ్యలు చేసిందని వార్తలు వెలువడ్డాయి. దీంతో నొచ్చుకున్న దంపతులు భావనపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వెంటనే ప్రతీకారం తీర్చుకుంటే తామే చేశామన్న విషయం తెలిసిపోతుందని సుదీర్ఘ కాలం వెయిట్ చేశారు. ఒక కార్పొరేటర్ ను కిరాయికి మాట్లాడుకుని పల్సర్ సునీతో కథ నడిపించారని పోలీసులు గుర్తించారు.

 Dileep Arrested in Actress abduction case
ఈ కేసులో ప్రధాన నిందితుడైన పల్సర్ సునీతో దిలీప్ మంతనాలు జరిపినట్లు పక్కా ఆధారాలు లభించడంతోనే దిలీప్‌ను అరెస్టు చేసినట్లు డీజీపీ లోక్‌నాథ్ బెహ్రా స్పష్టంచేశారు. జూన్ 28న పల్సర్ సునీని కస్టడీలోకి తీసుకున్న సిట్ అధికారులు అతడి నుంచి చాలా విషయాలు రాబట్టారు. దిలీప్ సినిమా షూటింగ్ స్పాట్లకు సునీ చాలా సార్లు వెళ్లి, అతడిని కలిసినట్లు సిట్ అధికారులు ఆధారాలు సేకరించారు. ఈ కేసులో ఇప్పటికే ఒక చార్జిషీట్‌ను ఫైల్ చేసిన సిట్ అధికారులు తాజాగా మరో చార్జిషీట్‌ను ఫైల్ చేసి నిందితులకు తగిన శిక్ష పడేలా చేయనున్నారు.

మరోవైపు హీరో దిలీప్‌పై దర్శకుడు వినయన్ తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. మలయాళ చిత్ర పరిశ్రమలోని ప్రముఖులను దిలీప్ తన గుప్పిట్లో పెట్టుకున్నాడని, ఫిల్మ్ అసోసియేషన్‌లో ప్రధానమైన వ్యక్తిగా ఉన్న దిలీప్‌ను తొలగించేందుకు పరిశ్రమలోని పెద్దలెవరూ ధైర్యం చేయలేకపోయారని ఆరోపించారు. నటిపై లైంగిక దాడి ఘటన అనంతరం దాని వెనుక ఉన్నది దిలీపేనని తెలిసినా అతడి గురించి ఎవరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదని , బాధిత నటికి మద్దతు ఇచ్చేందుకు కూడా ఎవరూ ముందుకు రాకపోవడం సిగ్గుచేటని వినయన్ వ్యాఖ్యానించారు. బాధిత నటి తన గుప్పిట్లోకి రావడం లేదనే కక్షతోనే ఆమెపై దాడి చేయించాడని డైరెక్టర్ వినయన్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో దిలీప్ మరింత కష్టాల్లో చిక్కుకున్నాడు.

- Advertisement -