కాంగ్రెస్ నేత దిగ్విజయ్ వివాదాస్పద పోస్టు

6
- Advertisement -

కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్టు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించిన పాత ఫోటోను ఆయన ఎక్స్ (ట్విటర్) వేదికగా షేర్ చేయడం వివాదాస్పదంగా మారింది. ఆ ఫోటోలో బీజేపీ సీనియర్ నేత ఎల్.కే. అడ్వాణీ కుర్చీలో కూర్చుని ఉండగా, అప్పటి గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ నేలపై కూర్చుని కనిపించారు.

ఈ ఫోటోను షేర్ చేస్తూ, నేలపై కూర్చున్న వ్యక్తే తరువాత దేశ ప్రధాని అయ్యారని పేర్కొంటూ, బీజేపీ సంస్థాగత నిర్మాణాన్ని దిగ్విజయ్ సింగ్ ప్రశంసించారు. ఒక సాధారణ స్థానం నుంచి వచ్చిన వ్యక్తికి పార్టీ వ్యవస్థ ద్వారా అత్యున్నత పదవి లభించిందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు బీజేపీకి అనుకూలంగా ఉన్నట్లుగా కనిపించడంతో కాంగ్రెస్ వర్గాల్లోనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

దిగ్విజయ్ సింగ్ తన పోస్టులో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కూడా ట్యాగ్ చేయడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో ఈ పోస్టు పార్టీ అధికారిక వైఖరికి విరుద్ధమా? అన్న చర్చ మొదలైంది.

వివాదం తీవ్రతరమైన నేపథ్యంలో దిగ్విజయ్ సింగ్ వివరణ ఇచ్చారు. తాను బీజేపీ సంస్థాగత నిర్మాణం గురించి మాత్రమే ప్రస్తావించానని, ప్రధాని మోడీని వ్యక్తిగతంగా ప్రశంసించలేదని స్పష్టం చేశారు. బీజేపీ విధానాలకు, రాజకీయాలకు తాను ఎప్పుడూ పోరాడుతూనే ఉంటానని, కాంగ్రెస్ సిద్ధాంతాలపైనే తన నిబద్ధత కొనసాగుతుందని దిగ్విజయ్ సింగ్ వెల్లడించారు.

Also Read:కొత్తిమీరతో ప్రయోజనాలు..!

- Advertisement -