పేదవారి ఆత్మగౌరవానికి ప్రతీక డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు..

269
- Advertisement -

దేశ చరిత్రలో పేదవారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిర్మిస్తున్న డబల్ బెడ్ రూము ఇళ్ల కార్యక్రమము చరిత్ర సృష్టించబోతుందనీ పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. ఈరోజు హైదరాబాద్ లోని కొల్లూరులో జరుగుతున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొల్లూరులో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇ ళ్లు అతిపెద్ద గృహ సముదాయంగా మారబోతుందన్నారు. సుమారు 9.65 మిలియన్ చదరపు అడుగుల వైశాల్యంలో కొల్లూరులో మొత్తం గృహాలు నిర్మిస్తున్నామని తెలిపారు.

దేశంలో ఇప్పటివరకు ప్రభుత్వం రంగంలో ఇంత పెద్ద గృహ సముదాయాన్ని ఒకేచోట నిర్మించలేదనీ. ఇక్కడ నిర్మిస్తున్న ఈ గృహాలు పేద వాడి ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు. ఇక్కడ నిర్మిస్తున్న ఇల్లు సకల సౌకర్యాలతో ఉండేలా ప్రణాళికలు రూపొందించి నిర్మాణాలు కొనసాగిస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.. కొల్లూరులో జిహెచ్ఎంసి తన సొంత నిధులతో సుమారు 124 ఎకరాలను సేకరించి పేదవారికి రెండు పడక గదుల ఇల్లు నిర్మించి అందించాలని సంకల్పించింది అని మంత్రి తెలిపారు.

Minister KTR

ఇక్కడ నిర్మిస్తున్న 15660 డబల్ బెడ్ రూమ్ ల మూలంగా కొల్లూరు ప్రాంతం ఒక పట్టణంగా మారుతుందని, రాబోయే కాలంలో సుమారు 70 వేల పైచిలుకు జనాభా ఇక్కడ నివాసం ఉంటుందన్నారు. అంతేకాకుండా ఇది ఒక ఆదర్శంగా పట్టణంగా పేద వారికి సకల సౌకర్యాలతో కూడిన సరికొత్త నివాసప్రాంతం కాబోతోందనీ, ఒక మున్సిపాలిటీ కి కావాల్సిన అన్ని సౌకర్యాలను ఇక్కడ ఉండేలా చూస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.గృహ సముదాయంలో వాణిజ్య సముదాయం నిర్మించి దాని నుండి వచ్చే ఆదాయం ద్వారా లిఫ్ట్ మరియు ఇతర నిర్వహణ ఖర్చులకు ఉపయోగపడేలా వెసులుబాటు కల్పించామన్నారు.

మురుగునీటి జలాల శుద్ధి కోసం మురుగునీటి శుద్ధి ప్లాంటు ఏర్పాటు చేయడంతో పాటు ఆధునిక మురుగునీటి వ్యవస్థను కూడా ఈ గృహ సముదాయం లో భాగంగా ఏర్పాటు చేయబోతున్నామన్నారు. కొల్లూరు టౌన్షిప్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ప్రతీరోజు మూడుషిఫ్టుల్లో దాదాపు 3,500 మంది కార్మికులు 400 మంది సిబ్బంది 24 గంటలు నిరంతరం పని కొనసాగిస్తున్నారన, మంత్రికి జిహెచ్ఎంసి హౌసింగ్ విభాగ అధికారులు తెలియజేశారు. ఇక్కడ జరుగుతున్న పనులను నిరంతరం పర్యవేక్షించడానికి సీసీ కెమెరాలు కూడా అమర్చి నిర్మాణ పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కొల్లూరులో అతిపెద్ద హౌసింగ్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న నేపద్యంలో అక్కడి పనుల పర్యవేక్షణ కోసం ప్రత్యేకమైన ఇంజనీరింగ్ విభాగాన్ని కొల్లూరులో ఏర్పాటుచేసి నిరంతరం పర్యవేక్షణ చేస్తే బాగుంటుందని మంత్రి సూచించారు.

ఇక్కడి పనుల పర్యవేక్షణ ను స్వయంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి తన మొబైల్ ఫోన్లో ఈ సీసీ కెమెరాల చిత్రాలను ప్రత్యక్షంగా చూస్తూ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈరోజు మంత్రి నగర మేయర్ బొంతు రామ్మోహన్ ,జిహెచ్ఎంసి కమిషనర్ జనార్దన్రెడ్డి ఇతర ఉన్నత అధికారులతో కలిసి కొల్లూరులో నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. నిర్మాణ స్థలం లో జరుగుతున్న పనుల పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. నిర్మాణ సమయంలోకార్మికుల పట్ల వారి భద్రతకు సంబంధించిన అన్ని రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

- Advertisement -