ఎన్ఆర్సీ(నేషనల్ రిజిష్టర్ ఆఫ్ సిటిజన్స్)-ఎన్పీఆర్(నేషనల్ పాపులేషన్ రిజిష్టర్) ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే అంశంపై చర్చనడుస్తోంది. కేంద్రం తీసుకొచ్చిన ఎన్‌ఆర్సీకి వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రస్ధాయిలో జరుగుతున్న నేపథ్యంలో ఎన్‌ఆర్సీకి ప్రత్యామ్నాయంగా ఎన్పీఆర్‌ని తీసుకొచ్చేలా వ్యూహాలు సిద్ధం చేస్తోంది బీజేపీ సర్కార్. ఇందుకోసం రూ. 3900 కోట్లను మంజూరు చేసింది.
ఈ నేపథ్యంలో అసలు ఎన్పీఆర్‌కు ఎన్ఆర్సీకి సంబంధం ఉందా అనే దానిపై నెటిజన్లు తీవ్రంగా వెతికెస్తున్నారు. ఎన్పీఆర్ అనేది దేశంలో సాధారణంగా నివసించే వారి జాబితా. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఎన్పీఆర్‌ని తీసుకొచ్చారు.
ఎన్పీఆర్ ప్రకారం ఒక నిర్దిష్ట ప్రాంతంలో గత ఆరునెలలుగా నివసిస్తున్నా వారు లేదా కనీసం ఆరు నెలల పాటు అక్కడ ఉందామనుకునేవారు సాధారణ నివాసులు. దీనికీ, పౌరుల గణనకూ సంబంధం లేదు. ఎందుకంటే ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఆరు నెలలకు మించి నివసిస్తున్న విదేశీయులనూ నేషనల్ పాపులేషన్ రిజిష్టర్ లో నమోదు చేస్తారు. ఎన్నార్సీలో మాత్రం భారతీయ పౌరులను మాత్రమే చేరుస్తారు.
అయితే కాంగ్రెస్ తీసుకొచ్చిన ఎన్పీఆర్‌కు ప్రస్తుతం వివరాలు సేకరించే ఎన్పీఆర్‌కు తేడా ఉంది. నేషనల్ పాపులేషన్ రిజిష్టర్ ను 2010లో, 2015లో నిర్వహించారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలపై సరైన నిర్ణయాలు తీసుకునేందుకు ఎన్పీఆర్ డేటా ఉపయోగపడుతుండగా గతంలో రాని వ్యతిరేకత ఇప్పుడే ఎందుకు వస్తుందంటే ఎక్కువ వివరాలను బీజేపీ ప్రభుత్వం సేకరిస్తుండటం.
2010లో నిర్వహించిన ఎన్పీఆర్ లో 15 అంశాలపై మాత్రమే ప్రజల నుంచి సమాచారం సేకరించారు. వ్యక్తి పేరు, కుటుంబ పెద్దతో అనుబంధం, తండ్రిపేరు, తల్లిపేరు, భర్త లేదా భార్య పేరు, లింగం, పుట్టిన తేదీ, వివాహబంధం, పుట్టిన ప్రాంతం, జాతీయత, ప్రస్తుత చిరునామా, ఎంతకాలంగా ఆ ప్రాంతంలో ఉంటున్నారు, శాశ్వత చిరునామా, వృత్తి, చదువు వివరాలు మాత్రమే గతంలో సేకరించారు.
ఇప్పుడు మాత్రం కొత్తగా ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, తల్లిదండ్రుల పుట్టిన తేదీ, పుట్టిన ప్రాంతం, గతంలో చివరిసారిగా ఎక్కడ నివసించారు, పాస్ పోర్ట్ ఉంటే దాని నెంబర్, వోటర్ ఐడీ కార్డ్ నెంబర్, పాన్ నెంబర్, డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ లాంటి వివరాలు కూడా సేకరించనున్నారు.
ఫలితంగా భవిష్యత్‌లో ఎన్నార్సీని గనుక చేపట్టదలిస్తే, అందుకు ఎన్పీఆర్ ఉపయోగపడుతుంది. ఒకసారి ఎన్పీఆర్ గనుక రూపొందితే ఎన్నార్సీని తయారు చేయడం సులభం. ఇదే విషయాన్ని 2014లోనే అప్పటి హోంశాఖ సహాయమంత్రి కిరెన్ రిజిజు పార్లమెంట్ లో స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే తొలుత ఎన్పీఆర్‌ని తీసుకురావాలని మోడీ సర్కార్ భావిస్తోంది. అందుకే ఎన్పీఆర్‌కు చెక్ పెడితేనే ఎన్నార్సీకి స్థానం ఉండదని విపక్షాలు భావిస్తున్నాయి. మొత్తంగా 2010లో నిర్వహించిన ఎన్పీఆర్ మాదిరిగా వివరాలు సేకరిస్తారో లేదా బీజేపీ భావిస్తున్నట్లు పూర్తి వివరాలతో ఎన్పీఆర్‌ని సేకరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.