రోజును సరిగా ప్రారంభించడం అంటే కేవలం తొందరగా లేవడం లేదా వ్యాయామం చేయడం మాత్రమే కాదు. పోషకాహార నిపుణుల మాటల్లో, ఉదయం నిద్రలేచిన వెంటనే మనం తినే లేదా తాగే మొదటి ఆహారం రోజంతా శక్తి స్థాయి, జీర్ణక్రియ, బరువు నియంత్రణపై ప్రభావం చూపుతుంది. రాత్రంతా ఉపవాసం తర్వాత ఉదయం శరీరం పోషకాలను గ్రహించేందుకు అత్యంత అనుకూలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర తర్వాత శరీరం స్వల్పంగా డీహైడ్రేషన్‌కు గురవుతుంది. తక్షణ శక్తి కూడా తక్కువగా ఉంటుంది. ఈ సమయంలో తీసుకునే ఆహారం మెటబాలిజం, గట్ హెల్త్‌ను మెరుగుపరచవచ్చు లేదా ఆలస్యం, ఆసిడిటీకి కారణం కావచ్చు అని ఆమె తెలిపారు. ఉదయం ఘన ఆహారానికి ముందు నీరు తాగడం చాలా ముఖ్యమని డా. పర్మీత్ కౌర్ స్పష్టం చేశారు. గోరువెచ్చని నిమ్మ నీరు లేదా కొబ్బరి నీరు శరీరాన్ని మళ్లీ హైడ్రేట్ చేయడమే కాకుండా జీర్ణక్రియను మృదువుగా ప్రారంభిస్తాయి.
నిమ్మ నీరు లివర్ పనితీరును, జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. కొబ్బరి నీరు సహజంగా ఎలక్ట్రోలైట్లను భర్తీ చేస్తుంది. చాలామంది ఈ దశను వదిలేస్తారు కానీ ఇది శారీరక శక్తి, సహజ డీటాక్సిఫికేషన్‌కు కీలకం అని ఆమె అన్నారు. ఇక్కడ ‘డీటాక్స్’ అంటే తీవ్రమైన శుభ్రపరిచే విధానాలు కాదు, సరైన హైడ్రేషన్ ద్వారా లివర్, కిడ్నీలు సహజంగా పనిచేయడాన్ని ప్రోత్సహించడమేనని ఆమె వివరించారు.
ఖాళీ కడుపుతో పండ్లు తినడం గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, సరైన పండ్లు ఎంచుకుంటే అవి చాలా లాభదాయకమని డైటీషియన్ చెప్పారు.బొప్పాయి, పుచ్చకాయ, బెర్రీలు వంటి పండ్లు తేలికగా జీర్ణమవుతాయి, నీరు ఎక్కువగా ఉండి యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఉదయం తొలుత తింటే కడుపుపై భారం లేకుండా సహజ శక్తిని ఇస్తాయి అని ఆమె తెలిపారు.
బొప్పాయి జీర్ణక్రియకు సహాయపడే ఎంజైమ్స్‌ను కలిగి ఉంటుంది, పుచ్చకాయ హైడ్రేషన్‌ను పెంచుతుంది, బెర్రీలు ఫైబర్‌తో పాటు మెటబాలిజాన్ని మెరుగుపరిచే గుణాలను కలిగి ఉంటాయి. అయితే పండ్లను ఉదయాన్నే బరువైన లేదా వేయించిన ఆహారంతో కలపకూడదని సూచించారు.
బ్రేక్‌ఫాస్ట్ చక్కెర ఎక్కువగా కాకుండా సమతుల్యంగా ఉండాలంటే, పండ్ల తర్వాత క్రమంగా పోషకాలను జోడించాలి అని సూచిస్తున్నారు. నానబెట్టిన బాదం ఆరోగ్యకరమైన కొవ్వులను అందించి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. గుడ్లు లేదా గ్రీక్ యోగర్ట్ వంటి ప్రోటీన్ వనరులు కండరాల పునర్నిర్మాణానికి, తృప్తి భావానికి సహాయపడతాయి. ఓట్మీల్ సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను అందించి దీర్ఘకాల శక్తిని ఇస్తుంది.
ఫైబర్, ప్రోటీన్ ఉన్న అల్పాహారం ఎక్కువసేపు తృప్తిగా ఉంచి మధ్యాహ్నానికి ముందే వచ్చే ఆకలిని తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా ముఖ్యం అని చెబుతున్నారు. ఓట్మీల్ నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తూ గట్ హెల్త్‌కు మేలు చేస్తుందని కూడా చెప్పారు.ఉదయం కడుపు పొర ఎక్కువ సున్నితంగా ఉంటుందని, అందువల్ల ఆహార ఎంపికలు చాలా కీలకమని హెచ్చరించారు.
Also Read:మద్యం సీసాలపై కూటమి తప్పుడు ప్రచారం!
చక్కెర ఎక్కువగా ఉన్నవి, మసాలా పదార్థాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు కడుపును రెచ్చగొట్టి ఇన్సులిన్ స్థాయిని ఒక్కసారిగా పెంచుతాయి. దీని వల్ల తర్వాత శక్తి తగ్గిపోవచ్చు అని ..ప్యాకేజ్డ్ జ్యూస్‌లు, పేస్ట్రీలు, మసాలా స్నాక్స్, వేయించిన పదార్థాలను ఉదయం తొలుత తీసుకోవద్దని, ముఖ్యంగా ఆసిడిటీ, గ్యాస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

