ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ 4–1తో పరాజయం పాలైన నేపథ్యంలో, ఇంగ్లండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను జట్టును సరిగా ముందుకు నడిపించలేకపోతే, తన స్థానంలో ఇంకెవరైనా మెరుగైన వ్యక్తి కోచ్‌గా రావచ్చని ఆయన స్వయంగా అంగీకరించారు.
గత కొన్ని ఏళ్లుగా ఆషెస్ టూర్‌ను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన అతివేగ దూకుడుతో కూడిన ‘బాజ్‌బాల్’ విధానం, మరోసారి ఆస్ట్రేలియా ముందు విఫలమైంది. సిరీస్ మొత్తం మీద ఇంగ్లండ్ జట్టు పూర్తిగా ఆధిపత్యం కోల్పోయింది.
ఈ భారీ ఓటమి ఉన్నప్పటికీ, ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) మెక్‌కల్లమ్ లేదా క్రికెట్ డైరెక్టర్ రాబ్ కీ భవిష్యత్తుపై తక్షణ నిర్ణయం తీసుకునే అవకాశం లేదని తెలుస్తోంది. ఈసీబీ సీఈఓ రిచర్డ్ గోల్డ్, ఆషెస్ టూర్ తర్వాత “సమగ్ర సమీక్ష” నిర్వహించి, అవసరమైన మార్పులు రాబోయే నెలల్లో అమలు చేస్తామని తెలిపారు.
తాను జట్టును సరిగా నడిపించలేకపోతే, నా స్థానంలో మరింత మెరుగైన వ్యక్తి బాధ్యతలు చేపట్టవచ్చు అని మెక్‌కల్లమ్ అన్నారు. ఆయన కాంట్రాక్ట్ మరో 18 నెలల వరకు కొనసాగుతుండటంతో, ప్రస్తుతం 2027లో ఇంగ్లండ్‌లో జరిగే ఆషెస్ సిరీస్ వరకూ కోచ్‌గా ఉండే అవకాశముంది. తన విధానాలపై తనకు పూర్తి నమ్మకం ఉందని మెక్‌కల్లమ్ చెప్పారు. వికాసం, మార్పులకు నేను వ్యతిరేకం కాదు. కానీ ఒక సిద్ధాంతంపై నిలబడాలి. మనం చేసే పనిపై నమ్మకం ఉండాలి అని అన్నారు.
మెక్‌కల్లమ్ నేతృత్వంలో ఇంగ్లండ్ మొదట్లో తొలి 11 టెస్టుల్లో 10 విజయాలు అందించారు. కానీ ఆ తర్వాత ఫలితాలు పడిపోయాయి. ఆస్ట్రేలియా, భారత్‌లతో జరిగిన నాలుగు కీలక సిరీస్‌లలో రెండు హోం డ్రాలు (2–2), రెండు ఘోర పరాజయాలు (4–1) ఎదురయ్యాయి.
Also Read:మద్యం సీసాలపై కూటమి తప్పుడు ప్రచారం!

