ప్రొటీన్ లోపం వల్ల శరీరంలో కనిపించే ఐదు సూక్ష్మమైన సంకేతాలను ఆరోగ్య నిపుణులు వివరించారు. ఇందులో తరచూ ఆకలి వేయడం, అలసట, జుట్టు రాలడం మరియు బరువు తగ్గడంలో ఇబ్బందులు వంటివి ఉన్నాయి. రోగనిరోధక శక్తి, జీవక్రియ మరియు మొత్తం ఆరోగ్యానికి ప్రొటీన్ ఎందుకు అవసరమో కూడా నిపుణులు హైలైట్ చేశారు.
చాలామంది ప్రొటీన్ అనేది కేవలం జిమ్‌కు వెళ్లేవారికి, అథ్లెట్లకు మాత్రమే అవసరమని భావిస్తారు. కానీ, కేవలం శారీరక దృఢత్వానికే కాకుండా శరీరంలోని హార్మోన్లు, రోగనిరోధక శక్తి, జుట్టు ఆరోగ్యం, జీవక్రియల నిర్వహణ మరియు కణాల పునరుద్ధరణ వంటి ఎన్నో అవసరాలకు ప్రొటీన్ ప్రతిరోజూ నిశ్శబ్దంగా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
రోజూ పప్పు, పెరుగు లేదా అప్పుడప్పుడు ప్రొటీన్లు ఉండే ఆహారాలు తింటున్నాం కాబట్టి శరీరానికి సరిపడా అందుతుందని చాలామంది భావిస్తారు. కానీ, ముఖ్యంగా మహిళలు, శాఖాహారులు, ఉద్యోగులు మరియు బరువు తగ్గాలని ప్రయత్నించే వారిలో.. శరీరం ఆశించే దానికంటే చాలా తక్కువ మోతాదులోనే ప్రొటీన్ అందుతోంది.
మీరు భోజనం చేసిన కొద్దిసేపటికే మళ్లీ ఆకలిగా అనిపిస్తే, మీ ప్లేట్‌లో తగినంత ప్రొటీన్ లేదని అర్థం. రిఫైండ్ కార్బోహైడ్రేట్లు (మైదా, చక్కెర వంటివి) ఎక్కువగా ఉండి, ప్రొటీన్ తక్కువగా ఉండే ఆహారాలు తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు వేగంగా హెచ్చుతగ్గులకు లోనవుతాయని డాక్టర్ అర్చన బాత్రా తెలిపారు. దీనివల్ల పదే పదే ఏవైనా స్నాక్స్ తినాలనే కోరికలు కలిగి, ఎక్కువ ఆహారం తినేలా చేస్తాయి. ప్రొటీన్ అనేది కడుపు నిండిన అనుభూతిని కలిగించే హార్మోన్లను పెంచి, ఎక్కువ సమయం ఆకలి వేయకుండా చూస్తుంది.
మన జుట్టు, గోళ్లు అనేవి ప్రధానంగా ‘కెరాటిన్’ అనే ప్రొటీన్ నిర్మాణంతో తయారవుతాయి. శరీరానికి ప్రొటీన్ అందడం చాలా కాలం పాటు తగ్గినప్పుడు, మన శరీరం అందానికి సంబంధించిన భాగాల కంటే.. బ్రతకడానికి అవసరమైన ముఖ్యమైన అవయవాలకు (గుండె, కాలేయం వంటివి) ప్రొటీన్‌ను సరఫరా చేయడానికి ప్రాధాన్యత ఇస్తుంది.
దీనివల్ల..జుట్టు విపరీతంగా రాలడం,గోళ్లు పెళుసుగా మారి విరిగిపోవడం,జుట్టు ఎదుగుదల మందగించడం. చర్మం జిడ్డు లేకుండా కాంతివిహీనంగా మారడం జరుగుతుంది. ప్రొటీన్ లోపం వల్ల చర్మాన్ని యవ్వనంగా ఉంచే ‘కొల్లాజెన్’ ఉత్పత్తి కూడా దెబ్బతింటుంది. అలసట అనేది కేవలం నిద్ర లేకపోవడం వల్లే రాదు. శరీరానికి సరైన మొత్తంలో ప్రొటీన్ అందకపోవడం కూడా ఇందుకు ఒక కారణం కావచ్చు. కండరాల పునరుద్ధరణ ,ఎంజైమ్‌ల ఉత్పత్తి,శక్తి స్థిరత్వానికి ఎంతో అవసరం. వ్యాయామం చేసిన తర్వాత కూడా కండరాల నొప్పులు తగ్గకపోవడం, రోజంతా నీరసంగా, తక్కువ శక్తితో ఉన్నట్లు అనిపించడం వంటివి ప్రొటీన్ లోపానికి సంకేతాలు.
బరువు తగ్గాలని ప్రయత్నించే చాలామంది కేవలం క్యాలరీలను తగ్గించడంపైనే దృష్టి పెడతారు. ప్రొటీన్ తక్కువగా తీసుకుంటూ క్యాలరీలు తగ్గిస్తే, అది రివర్స్ అవ్వచ్చు. దీనివల్ల కొవ్వు తగ్గడానికి బదులు కండరాలు కరిగిపోయి , కొవ్వు పేరుకుపోయే ప్రమాదం పెరుగుతుంది. పైగా, ఫ్యాట్స్ మరియు కార్బోహైడ్రేట్లతో పోలిస్తే ప్రొటీన్‌ను అరిగించడానికి శరీరం ఎక్కువ క్యాలరీలను ఖర్చు చేస్తుంది .
Also Read:తిలక్ వర్మపై అర్ష్‌దీప్ కామెంట్?
మన శరీరంలో యాంటీబాడీలు, రోగనిరోధక కణాలు ప్రొటీన్‌తోనే నిర్మితమవుతాయి కాబట్టి వ్యాధి నిరోధక శక్తిలో దీని పాత్ర చాలా పెద్దది. తరచూ జలుబు చేయడం, గాయాలు త్వరగా మానకపోవడం, పదే పదే ఇన్ఫెక్షన్ల బారిన పడటం వంటివి ప్రొటీన్ లోపానికి అద్దం పడతాయని డాక్టర్ బాత్రా వివరించారు. ఒక వ్యక్తికి ఎంత ప్రొటీన్ కావాలనేది వారి వయస్సు, జీవనశైలి, శారీరక శ్రమపై ఆధారపడి ఉంటుంది.
కూర్చుని పనిచేసే సాధారణ వ్యక్తికి వారి శరీర బరువులో ప్రతి కేజీకి 0.8 నుండి 1 గ్రాము ప్రొటీన్ అవసరం (ఉదాహరణకు 60 కేజీల బరువు ఉంటే 48-60 గ్రాముల ప్రొటీన్). ఎక్కువ శారీరక శ్రమ చేసేవారు, వృద్ధులు, హార్మోన్ల సమస్యలు ఉన్న మహిళలు మరియు బరువు తగ్గాలనుకునే వారికి: అంతకంటే ఎక్కువ మోతాదులో ప్రొటీన్ అవసరమవుతుంది.ప్రొటీన్ మొత్తాన్ని కేవలం రాత్రి భోజనంలోనే తీసుకోకుండా.. రోజూ తినే అన్ని ఆహారాల్లో (బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్) విభజించుకుని తీసుకోవాలని డాక్టర్ అర్చన బాత్రా సూచించారు. ఇందుకోసం గుడ్లు, పనీర్, గ్రీక్ యోగర్ట్, టోఫు, పప్పుధాన్యాలు, చేపలు, చికెన్, సోయా ఉత్పత్తులు, బాదం, జీడిపప్పు వంటి గింజలు మరియు విత్తనాలను తమ ఆహారంలో భాగం చేసుకోవాలి.

