ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫిలో భాగంగా ఓవెల్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బ్యాట్స్ మెన్స్ విరవీహారం చేశారు. ఓపెనర్లు శిఖర్ దావన్, రోహిత్ శర్మలకు తోడుగా ధోని రాణించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కొల్పోయి 321 పరుగులు చేసింది.
తొలుత టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్‌ని ఎంచుకుంది. లంక కెప్టెన్ మాథ్యూస్ తీసుకున్న నిర్ణయం సరైంది కాదని నిరూపిస్తు భారత ఓపెనర్లు రెచ్చిపోయారు. రోహిత్, ధావన్‌లు మరోసారి సెంచరీ భాగస్వామ్యంతో కదం తొక్కారు. తొలి వికెట్‌కు 138 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. రోహిత్ 79 బంతుల్లో 6 ఫోర్లు,3 సిక్సర్ల సాయంతో 78 పరుగులు చేసి పెవిలియన్ బాటపట్టాడు.
టీమిండియా సారథి విరాట్ కోహ్లీ (0; 5 బంతుల్లో) అభిమానులకు షాకిచ్చాడు. కీలక మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు.తర్వాత వచ్చిన యువరాజ్ కూడా 7 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాటపట్టాడు. అయితే మరో ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీతో రాణించాడు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో మూడు శతకాలు బాదిన గిబ్స్, గంగూలీ, గేల్ సరసన నిలిచాడు. గబ్బర్‌కు ఇది వన్డేల్లో 10వ శతకం కావడం గమనార్హం.
128 బంతుల్లో 125 పరుగలు చేసి ధావన్ ఔటవ్వగా చాలాకాలంగా ఫామ్‌లో లేని ధోని హాఫ్ సెంచరీతో రాణించాడు. 52 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 63 పరుగులు చేయగా కేదార్ జాదవ్ 25 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.