ధరణి పోర్టల్ వందశాతం విజయవంతం: సీఎం కేసీఆర్

180
kcr
- Advertisement -

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రెవెన్యూ రికార్డుల నిర్వహణ ఎంతో అస్తవ్యస్తంగా ఉండేదని, దీని కారణంగా ఘర్షణలు, వివాదాలు తలెత్తేవని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. రెవెన్యూ రికార్డులు స్పష్టంగా లేకపోవడం వల్ల కలిగే అనర్ధాలను రూపుమాపేందుకు, ప్రతి గుంటకూ యజమాని ఎవరో స్పష్టంగా తెలిసేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసిందని వెల్లడించారు. భూ రికార్డుల సమగ్ర ప్రక్షాళన, కొత్త పాస్ పుస్తకాల పంపిణీ, కొత్త రెవెన్యూ చట్టం తదితర సంస్కరణల ఫలితంగా భూ యాజమాన్య విషయంలో స్పష్టత వస్తున్నదని చెప్పారు. భూ రికార్డుల నిర్వహణ, అమ్మకాలు, కొనుగోళ్లు తదితర ప్రక్రియలన్నీ పారదర్శకంగా, అవినీతి రహితంగా, ఎలాంటి జాప్యం లేకుండా ఉండేందుకు తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వందకు వంద శాతం విజయవంతమైందని ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోళ్ల విషయంలో మరింత వెసులుబాటు కలిగించేందుకు అవసరమైన మార్పులను వారం రోజుల్లోగా ధరణి పోర్టల్ లో చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రెవెన్యూ పరమైన అంశాలన్నింటినీ జిల్లా కలెక్టర్లే స్వయంగా పూనుకొని సత్వరం పరిష్కరించాలని కోరారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు పూర్తయిన వ్యవసాయ భూముల మ్యుటేషన్ ను వెంటనే నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. పెండింగ్ మ్యుటేషన్ల కోసం తాజాగా దరఖాస్తులు తీసుకోవాలని, వారం రోజుల్లోగా మ్యుటేషన్లు చేయాలని కోరారు.

‘‘ధరణి పోర్టల్ ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చాలి. ఇందుకోసం తక్షణం కొన్ని మార్పులు, చేర్పులు చేయాలి. ఎన్నారైలకు తమ పాస్ పోర్ట్ నంబరు ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేయడానికి ధరణి పోర్టల్ లో అవకాశం కల్పించాలి. కంపెనీలు, సొసైటీలు కొనుగోలు చేసిన భూములకు కూడా పాస్ బుక్ పొందే విధంగా ధరణిలో వెసులుబాటు కల్పించాలి. గతంలో ఆధార్ కార్డు నంబరు ఇవ్వనివారి వివరాలను ధరణిలో నమోదు చేయలేదు. అలాంటివారికి మరోసారి అవకాశం ఇచ్చి, ఆధార్ నంబరు నమోదు చేసుకొని పాస్ పుస్తకాలు ఇవ్వాలి. ఏజెన్సీ ఏరియాల్లోని ల్యాండ్ ట్రాన్స్ ఫర్ రెగ్యులేషన్స్ వివాదాలన్నింటినీ జిల్లా కలెక్టర్లు నెల రోజుల్లో పరిష్కరించాలి. స్లాట్ బుకింగ్ చేసుకున్నవారు తమ బుకింగ్ ను క్యాన్సిల్ చేసుకోవడానికి, రీ షెడ్యూల్ చేసుకోవడానికి ధరణిలోనే అవకాశం కల్పించాలి. నిషేదిత భూముల జాబితాను ఎప్పటికప్పుడు అవసరమైన మార్పులతో సవరించాలి. కోర్టు తీర్పులకు అనుగుణంగా మార్పులు చేయాలి. ప్రభుత్వం రైతుల నుండి సేకరించిన భూమిని కూడా వెనువెంటనే నిషేధిత జాబితాలో చేర్చాలి. కోర్టు కేసులు మినహా పార్ట్ – బిలో చేర్చిన అంశాలన్నింటినీ పరిష్కరించాలి. సాదాబైనామాల క్రమబద్దీకరణ కోసం వచ్చిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్లు పరిశీలించి, పరిష్కరించాలి. ధరణి పోర్టల్ లో జీపీఏ, ఎస్పీఏ, ఏజీపీఏ చేసుకోవడానికి అవకాశం కల్పించాలి. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఏర్పడే జిల్లాస్థాయి ట్రిబ్యునల్ లో ఇప్పటివరకు రెవెన్యూ కోర్టుల పరిధిలో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలి.రెవెన్యూ పరమైన అంశాలన్నింటినీ కిందిస్థాయి అధికారులకు అప్పగించి, కలెక్టర్లు చేతులు దులుపుకుంటే ఆశించిన ఫలితం రాదు. కాబట్టి కలెక్టర్లే అన్ని విషయాల్లో స్వయంగా పరిశీలన జరిపి, నిర్ణయాలు తీసుకోవాలి’’ అని ముఖ్యమంత్రి అన్నారు.

‘‘ ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో తొమ్మిదవ తరగతి నుండి ఆ పై తరగతులకు ఫిబ్రవరి 1 నుంచి తరగతులు నిర్వహించాలి. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఇతర వృత్తి విద్యా కోర్సుల తరగతులను నిర్వహించాలి. ఈ లోగా అన్ని విద్యా సంస్థలను, హాస్టళ్లను, రెసిడెన్షియల్ స్కూళ్లను, వాటిలోని టాయిలెట్లను సిద్ధం చేయాలి. అవన్నీ పరిశుభ్రంగా ఉండే విధంగా కలెక్టర్లు అవసరమైన చర్యలు తీసుకోవాలి. విద్యా సంస్థలు నిర్వహించక చాలా రోజులు అవుతున్నది కాబట్టి అందులోని సామాగ్రినంతటినీ శుభ్రపరచాలి. అప్పుడు నిల్వ చేసిన బియ్యం, పప్పు, ఇతర ఆహార ధాన్యాలు, వంట సామాగ్రి పురుగుపట్టే అవకాశం ఉంటుంది కాబట్టి స్టాకును సరి చూసుకోవాలి. మొత్తంగా ఈ నెల 25 లోగా విద్యా సంస్థలను తరగతులు నిర్వహించడానికి అనుగుణంగా సిద్ధం చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర హాస్టళ్లను మంత్రులు సందర్శించి, విద్యార్థుల వసతికి అనుగుణంగా తీర్చిదిద్దాలి’’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు.

- Advertisement -