ఆలయాలపై దాడుల ఘటనల్లో రాజకీయ నేతల హస్తం- డీజీపీ

45
AP DGP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాలకు రక్షణ లేదు అన్న ప్రచారం శుద్ధ అబద్ధం. ఇది కొన్ని రాజకీయ పక్షాలు పనికట్టుకుని చేస్తున్న ప్రచారం మాత్రమే అని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. ఏపీలో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలపై రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ మంగళగిరిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ..గత సంవత్సరాల గణాంకాలు పరిశీలిస్తే 2020లో దేవాలయ సంబంధిత ఘటనల సంఖ్య లో ఎటువంటి పెరుగుదల కనిపించలేదు. కానీ ప్రతి సంఘటన తరువాత రాజకీయ పార్టీల దుష్ప్రచారం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అదికూడా ఒక పథకం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్తిరపరచాలనే దురుద్దేశం కనిపిస్తూ ఉందని అన్నారు.

దేవాలయాలకు సంబందించిన 44 ఘటనలలో 29 కేసులు చేదించి 81 మంది నేరస్థులను అదుపులోకి తీసుకున్న విషయాన్ని ఇదివరకే పత్రికా ముఖంగా తెలియచేయడం జరిగింది. అంతే కాకుండా ఆలయాల భద్రతకు తీసుకొంటున్న చర్యల గురించి కూడా సవివరంగా తెలియ చేయటం జరిగింది. ఇప్పటి వరకు ఛేదించబడిన కేసులలో తొమ్మిదింటిలో రాజకీయ పార్టీలకి చెందిన 21 మందికి ప్రత్యక్షంగా ప్రమేయం ఉండటం ఇన్వెస్టిగేషన్‌లో తేలింది. అందులో 15 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశాం. ఈ ఘటనలో17 మంది టీడీపీ నేతలు, నలుగురు బీజేపీ నేతల హస్తం ఉన్నట్టు డీసీపీ పేర్కొన్నారు. ఇప్పటికే 13 మంది టీడీపీ నేతలు, ఇద్దరు బీజేపీ నేతల అరెస్ట్‌ చేశామని తెలపారు.

మిగతా అన్ని కేసులలో కూడా దుష్ప్రచారం చేయడంతో పాటు మత విద్వేషాలు రెచ్చగొట్టడంలో ఇతర రాజకీయ పక్షాల కుట్ర కనిపిస్తోంది. అట్టి వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోము. రాజకీయ పక్షాలు మత విద్వేషాలను రెచ్చగొట్ట వద్దని పత్రికా ముఖంగా విన్నవిస్తున్నాను. సోషల్ మీడియాలో కూడా ఇష్టమొచ్చినట్లు రూమర్లు స్ప్రెడ్ చేయవద్దని మనవి. అట్లు చేసిన యెడల కఠిన చర్యలు తీసుకునేందుకు వెనకామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ హెచ్చరించారు. ఏపీలో మతసామరస్యాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆలయాలపై దాడులకు సంబంధించిన కేసుల్లో సిట్ దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు.

అమర్చబడిన కెమెరాలు: 13296 దేవాలయాలలో 44521 కెమెరాలు
బైండ్ ఓవర్ చేయ బడిన దేవాలయ నేరగాళ్ళు & కమ్యూనల్ సస్పెక్ట్ లు: 4643
ఏర్పాటు చేయ బడిన గ్రామ రక్షక దళాలు: 18050
ఛేదించబడిన దేవాలయ నేరాలు: 180
అన్ని రకాలైన దేవాలయ నేరాలలో అరెస్ట్ కాబడిన ముద్దాయిలు: 337
సిట్ కొరకు కేటాయించబడిన నెంబర్: 9392903400