దర్శన టికెట్లు ఉంటేనే తిరుమలకు అనుమతి: టీటీడీ

132
ttd
- Advertisement -

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శన టికెట్లు ఉంటేనే తిరుమలకు అనుమతిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) స్పష్టం చేసింది. ఈ మేరకు తితిదే ప్రకటన విడుదల చేసింది. కొవిడ్ టీకా ధ్రువపత్రం, ఆర్టీపీసీఆర్‌ నెగెటివ్‌ సర్టిఫికెట్‌ ఉండాలని తెలిపింది. చాలా మంది దర్శన టికెట్లు లేకుండా అలిపిరి నుంచి వెనుదిరుగుతున్నారని పేర్కొంది. ఆన్‌లైన్‌లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఉచిత సర్వదర్శనం, వర్చువల్‌ సేవలు, శ్రీవాణి ట్రస్టు ద్వారా జారీ చేసే దర్శన టికెట్లు కలిగిన భక్తులకు మాత్రమే తిరుమలకు అనుమతిస్తామని తితిదే పేర్కొంది. దీంతో పాటుగా ఈ నెల 7 నుంచి 15 వరకు జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు కొవిడ్ వ్యాక్సినేషన్‌ ధ్రువపత్రం, లేదా 72 గంటలకు ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్‌ నెగెటివ్‌ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా తీసుకురావాలని సూచించింది.

నిత్యం వెయ్యి మందికి..

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో వెనుకబడిన వర్గాల ప్రజలకు స్వామివారి దర్శనాన్ని కల్పించనున్నట్లు తితిదే వెల్లడించింది. నిత్యం వెయ్యి మందికి శ్రీవారిని దర్శంచుకునేందుకు అవకాశం కల్పిస్తామని పేర్కొంది. తితిదే ఆలయాలు నిర్మించిన ప్రాంతాల్లోని ప్రజలకూ శ్రీవారి దర్శనం కల్పిస్తామని తెలిపింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈ నెల 7 నుంచి 14 వరకు వెనుకబడిన వర్గాల వారికి దర్శనం కల్పిస్తామని వెల్లడించింది. రోజుకు వెయ్యి మందికి ఉచిత రవాణా, భోజనం, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని తెలిపింది.

- Advertisement -