ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ లో మహా కుంభ మేళా సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయంలో మంగళవారం స్వామివారికి నిత్య కైంకర్యాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.శ్రీవారి ఆలయంలో నిత్య కైంకర్యాల తరహాలో ఉదయం తిరుప్పావై సేవ, తోమాలసేవ, కొలువు, సహస్ర నామార్చన నిర్వహించారు. అనంతరం స్వామివారికి నైవేద్యం సమర్పించి భక్తులను దర్శనాలకు అనుమతించి స్వామివారి ప్రసాదాలు వితరణ చేశారు.
సాయంత్రం 4 గంటలకు నమూనా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వాహన మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి వేడుకగా ఊంజల్ సేవ నిర్వహించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు హాజరై స్వామివారి వైభవాన్ని తిలకించి పులకించారు. మంగళవారం రోజు సాయంత్రం 6 గంటల వరకు 7,083 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
ప్రయాగ్ రాజ్ లోని శ్రీవారి నమూనా ఆలయంలో భక్తులు విరాళాలు సమర్పించేందుకు వీలుగా టీటీడీ కీయోస్క్ మిషన్ (సెల్ఫ్ ఆపరేటెడ్ మిషన్) ఏర్పాటు చేసింది. ఈ మిషన్ ద్వారా భక్తులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి రూ.1 నుండి రూ.99,999 వరకు తమకు తోచిన మొత్తాన్ని టీటీడీకి విరాళంగా ఇవ్వవచ్చు.కాగా జనవరి 18వ తేదీన ఉదయం 11 నుండి 12 గంటలకు శ్రీవారి నమూనా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై స్వామివారికి కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు.
Also Read:కాంగ్రెస్ పార్టీ గోవిందా..ముగ్గులు వేసి నిరసన