తెలుగుదేశం పార్టీ సినీయర్ నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ గుండెపోటుతో మృతి చెందారు. వారం రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతున్నట్టు తెలుస్తోంది. నెహ్రూ మరణ వార్త తెలియడంతో పలువురు ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయం నెహ్రూ మృతదేహాన్ని విజయవాడకు తరలిస్తారని సమాచారం. నెహ్రూకు ఒక అమ్మాయి, అబ్బాయి వున్నారు.
ఇప్పటివరకు ఆరుసార్లు(1983, 1985, 1989, 1994, 2009లో) ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. ఎన్టీఆర్ హయాంలో ఆయన మంత్రిగా పనిచేశారు. విజయవాడ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు నెహ్రూ. ఆయన స్టూడెంట్‌గా ఉన్న రోజుల్లో టీడీపీ చేపట్టిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారని పలువురు సీనియర్లు చెబుతున్నారు. 1982లో యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (యూఎస్ఓ)ను నెహ్రూ ఏర్పాటు చేశారు. ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే ఒక బలమైన శక్తిగా ఎదిగింది. అనంతరం వంగవీటి-నెహ్రూ వర్గాల మధ్య వివాదాలు చెలరేగాయి.
ఈ గొడవల్లో నెహ్రూ సోదరుడిని ప్రత్యర్థులు హత్య చేశారు. 1983 టీడీపీ ఆవిర్భావం సందర్భంగా తెలుగుదేశంపార్టీలో దేవినేని చేరారు. అదే ఏడాదిలో కంకిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడు.. ఎన్టీఆర్ మరణించినప్పుడు ఆయన పక్కనే ఉన్నారు. చివరివరకు ఎన్టీఆర్‌తో ఉన్న నెహ్రూ ఆయన మరణాంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ మారినప్పటికీ ఎన్టీఆరే తమ దైవమని చెప్పుకునేవారు. 2004లో కాంగ్రెస్ తరపున పోటీచేసి ఓడిపోయిన ఆయన 2009లో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరారు.