ఉద్ధవ్–ఠాక్రేపై ఫడ్నవీస్ విమర్శలు

7
- Advertisement -

రాబోయే బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలు ముంబై ప్రజల కోసం కాదు, ఠాక్రే కుటుంబం రాజకీయ మనుగడ కోసం జరుగుతున్న పోరాటమని అన్నారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్. శివాజీ పార్క్‌లో నిర్వహించిన సభలో ఆయన ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలపై తీవ్ర విమర్శలు చేస్తూ, బీఎంసీపై వారు ఏళ్ల తరబడి పాలించిన తీరును ఎండగట్టారు. ఇద్దరూ ఒక్కసారిగా కలవడాన్ని ఎద్దేవా చేస్తూ వ్యాఖ్యలు చేశారు. ఇది, ఒక రోజు ముందు అదే ప్రదేశంలో ఉద్ధవ్–రాజ్ కలిసి నిర్వహించిన ర్యాలీకి ప్రతిస్పందనగా జరిగింది.

ముంబై: బీఎంసీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు రాజకీయ ఉష్ణోగ్రతలు పెరిగిన వేళ, ముంబై శివాజీ పార్క్‌లో మహాయుతి నిర్వహించిన భారీ ర్యాలీలో సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తీవ్ర స్థాయిలో ప్రసంగించారు. ఉద్ధవ్ ఠాక్రే (శివసేన–యూబీటీ), ఎంఎన్‌ఎస్ అధినేత రాజ్ ఠాక్రే కలిసి ప్రారంభించిన ప్రచారానికి ఇది నేరుగా కౌంటర్‌గా నిలిచింది.

విపక్షాలు ముందుకు తెస్తున్న ‘మరాఠీ మానూస్’ నినాదాన్ని ఫడ్నవిస్ కొట్టిపారేశారు. జనవరి 15న జరగనున్న బీఎంసీ ఎన్నికలు ముంబై ప్రజల కోసం కాకుండా, ఠాక్రే కుటుంబ రాజకీయ భవితవ్యాన్ని కాపాడుకునే ప్రయత్నమని వ్యాఖ్యానించారు.తన ప్రసంగంలో తీవ్రంగా స్పందించిన ఫడ్నవిస్, మూడుదశాబ్దాల పాటు బీఎంసీని పాలించిన వారి పనితీరును ప్రశ్నించారు.ఈ రోజు మరాఠీ మనిషి ఇబ్బందుల్లో ఉన్నాడంటే, 30 ఏళ్లు మీరు ఏమి చేశారు? గోళీలు ఆడుకుంటున్నారా? అంటూ శివసేన దీర్ఘకాల పాలనపై ఎద్దేవా చేశారు.

ఉద్ధవ్–రాజ్ ఠాక్రే గతంలో ఇద్దరూ పరస్పరం విమర్శలు చేసుకున్న పాత వీడియో క్లిప్‌లను సభలో ప్రదర్శించారు. చుల్లు భర్ పానీ మేన్ దూబ్ మారో (ఒక చెంచా నీటిలో మునిగి చావాలి) అంటూ, 25 ఏళ్ల బీఎంసీ పాలనలో మరాఠీల ప్రయోజనాలను కాపాడడంలో విఫలమై ఇప్పుడు ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు.

Also Read:Delhi AQI:మూడేళ్లలో ఇదే తొలిసారి!

- Advertisement -