డేరాబాబాకు జీవిత ఖైదు..

233

దాదాపు పదహారేళ్ల కిందట జరిగిన ఒక హత్య కేసులో హర్యానాలోని డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రాం రహీం సింగ్‌తోపాటు మరో ముగ్గురికి పంచకులలోని సీబీఐ కోర్టు జీవిత కారాగార శిక్ష విధించింది. జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి రూ 50,000 జరిమానా విధించింది. లైంగిక దాడి కేసుల్లో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరాబాబాకు జర్నలిస్ట్‌ హత్య కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం జీవిత ఖైదు ఖరారు చేసింది.

Dera Baba

కాగా పూరాసచ్‌ పేరుతో రాంచందర్‌ ఛత్రపతి నిర్వహించే వార్తాపత్రికలో డేరా బాబా ఆశ్రమంలో మహిళలు, బాలికలపై లైంగిక వేధింపులకు సంబంధించి పలు వార్తలు ప్రచురితమయ్యేవి. డేరా బాబా నిర్వాకాలపై కథనాలు ప్రచురిస్తున్న క్రమంలో ఆయనను 2002లో కొందరు దుండగులు హత్య చేశారు. అనంతరం ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ రాంచందర్ కుటుంబసభ్యులు పంజాబ్, హర్యానా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దానిపై విచారణ జరిపిన న్యాయస్థానం కేసును సీబీఐకి అప్పగించింది. ఈ హత్య కేసులో 2003లో డేరా బాబాపై కేసు నమోదు చేయగా, 2006లో కేసుపై విచారణను సీబీఐ చేపట్టింది. 2007లో కేసుకు సంబంధించి అభియోగాలు నమోదు చేశారు. ఈ కేసులో డేరా బాబాను దోషిగా నిర్ధారిస్తూ గురువారం హర్యానాలోని పంచ్‌కుల సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం తీర్పు వెలువరించింది.