అత్యాచారం కేసులో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, డేరా సచ్చా సౌదా అధినేత బాబా గుర్మిత్ రామ్ రహీమ్ సింగ్‌కు 20 సంవత్సరాల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఏడాది క్రితం అంటే ఇదే ఆగస్టు 25న హరియాణాలోని పంచుకుల సీబీఐ కోర్టు గుర్మీత్ బాబాను దోషిగా తేల్చింది. ప్రస్తుతం మీడియాకు అందిన సమాచారం ప్రకారం అప్పట్లో అతని బరువు 105 కిలోలు. గడచిన 12 నెలల్లో 13 కిలోల బరువుతగ్గి ప్రస్తుతం 92 కిలోలకు చేరుకున్నాడు. ముఖం మీద కళ తగ్గడంతోపాటు గడ్డం నెరిసిపోయింది.
కాగా రామ్‌రహీం జైలులో తోటి ఖైదీల మాదిరిగానే జీవితం గడుపుతున్నాడు. కూరగాయలు పండించే పనిచేస్తున్నాడు. ఉదయం వాకింగ్‌తో పాటు యోగా చేస్తుంటాడు. అలాగే బ్యాడ్మింటన్ కూడా ఆడుతుంటాడు. ప్రముఖ రచయిత మున్షీప్రేమ్ చంద్ రచనలు చదువుతుంటాడు. ప్రతీరోజూ రామ్‌రాహీం కూరగాయల తోటల్లో పనిచేస్తున్నందుకు ప్రతిగా జైలు అధికారులు రోజుకు అతనికి రూ. 200 అందజేస్తుంటారు. కాగా గుర్మీత్ క్యాంటిన్‌కు వెళ్లే సమయంలో భద్రత దృష్ట్యా మిగిలిన ఖైదీలు వారివారి బ్యారక్‌లకే పరిమితమై ఉంటారు. ప్రస్తుతం ఆయన రోహ్‌తక్ జైల్లో ఉన్నారు.