దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సుప్రీం కోర్టు న్యాయమూర్తులు మీడియాముందుకు వచ్చి భారత ప్రధాన న్యాయమూర్తిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు పాలన సరైన దిశలో సాగడం లేదని సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నివాసంలో జస్టిస్ జాస్టి చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ మీడియాతో మాట్లాడారు.
కొన్ని నెలలుగా సుప్రీంకోర్టులో ఎన్నో జరగకూడని సంఘటనలు జరిగిపోయాయని చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇలా తొలిసారి మీడియాతో మాట్లాడాల్సి వస్తున్నదని ఆయన స్పష్టంచేశారు. దేశం ముందు తమ ఆందోళనలను ఉంచాలన్న ఉద్దేశంతోనే మీడియా ముందుకు వచ్చినట్లు చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం మనుగడ సాధించడం అసాధ్యమని చలమేశ్వర్ అనడం గమనార్హం.
సుప్రీంకోర్టును సరిగా నడిపించే విషయంలో చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాను ఒప్పించడంలో విఫలమయ్యామని, గత్యంతరం లేకే మీడియా ముందుకు వచ్చామని పేర్కొన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని సరిగా నడిపించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. స్వతంత్రంగా వ్యవహరించే ప్రధాన న్యాయమూర్తి అవసరమన్నారు. జరుగుతున్న పరిణామాలను దేశ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని, ప్రధాన న్యాయమూర్తిని అభిశంచించాలా? లేదా అన్నది దేశ ప్రజలే నిర్ణయించాలని అన్నారు.
మెడికల్ కాలేజీల అనుమతుల కోసం జడ్జీలకు లంచాలు ఇచ్చారన్న కేసులో జస్టిస్ చలమేశ్వర్ బెంచ్‌ను సీజేఐ తప్పించడం ఈ వివాదానికి కారణమైంది.