ఓ నిందితుడుని పోలీసులు నగ్నం నడిపించారు. ఈ సంఘటన ఢీల్లీలోని ఇందరపురిలో చోటుచేసుకుంది. ఈ వ్యవహారం గతవారం జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక వీడియోలో నిందితుడిని అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులకు చిక్కకుండా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూ ఉండగా.. మరో వీడియోలో నడిరోడులో నగ్నంగా నడిపిస్తున్నట్లు ఉంది.
నిందితుడి కుటుంబ సభ్యులు మాట్లాడూ.. తనను పట్టుకునేందుకు వచ్చిన ప్రతిసారి పోలీసులకు చిక్కకుండా ముప్పుతిప్పలు పెడుతున్నాడని, అది మనసులో పెట్టుకుని ఇలా నడిరోడ్డుపై నడిపించారని, బట్టలు తీసుకుని వచ్చినా.. తనకు ఇవ్వకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. కావాలనే పోలీసులు పొడవైన మార్గాన్ని ఎంచుకుని తమను అవమానించారని నిందితుడి భార్య ఆరోపించారు.
ఈ ఘటనపై ఢిల్లీ పోలీస్ పీఆర్ఓ దీపేంద్ర పాఠక్ మాట్లాడుతూ.. నిందితుడిపై 31 చోరీ కేసులు, నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఉన్నట్లు తెలిపారు. పట్టుకోవడానికి వచ్చిన పోలీసులను చూసి నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించాడని.. ఆ సమయంలో తన ఒంటిపై టవల్ మాత్రమే ఉందని, పట్టుకునే క్రమంలో ఊడిపోయిందని తెలిపారు. నిందితుడు కావాలనే ఈ సీన్ క్రియేట్ చేశాడని తెలిపారు. వ్యాన్ లో ఎక్కించిన తర్వాత బట్టలు ఇచ్చామని ఆయన పేర్కొన్నారు.