కరోనా వ్యాప్తి నియంత్రణకు ఢిల్లీలో అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం మరో వారం పొడిగించింది. లాక్‌డౌన్ పొడగిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ నెల 31వ తేదీ ఉదయం 5 గంటల వరకు కొనసాగుతుందని ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో కొవిడ్ పాజిటివిటీ రేటు 2.5శాతానికి తగ్గిందని చెప్పారు. 24 గంటల్లో కొత్తగా 1,600 కరోనా కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. కొవిడ్ కేసులు తగ్గుముఖం పడితే నెలాఖరు నుంచి అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు.
ప్రతి ఒక్కరికి టీకాలు వేస్తేనే థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనే అవకాశం ఉందని, అందరికీ వీలైనంత త్వరగా టీకాలు వేసేందుకు యోచిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు. టీకాలకు సంబంధించి దేశీయ, విదేశీ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. కరోనా కేసులు తీవ్రరూపం దాల్చడంతో తొలుత ఏప్రిల్ 19న ఢిల్లీలో లాక్‌డౌన్ విధించారు. అప్పట్నించీ నాలుగు సార్లు సంపూర్ణ లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ వచ్చారు. ఈ నెల 24న ఉదయం 5 గంటలతో గడువు ముగియనున్న నేపథ్యంలో మరో వారం రోజులు పొడగించింది ప్రభుత్వం.