2020 ఢిల్లీ అల్లర్లు..పిటిషన్లు కొట్టివేత

1
- Advertisement -

2020లో ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లకు సంబంధించి రాజకీయ నాయకులపై ఆరోపించిన విద్వేష ప్రసంగాల ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. అలాగే 2020 ఢిల్లీ అల్లర్లు, 2019లో జామియా మిలియా ఇస్లామియాలో జరిగిన హింసాత్మక ఘటనలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కూడా కోర్టు తిరస్కరించింది.

జస్టిస్ వివేక్ చౌదరి, జస్టిస్ మనోజ్ జైన్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ పిటిషన్లపై తీర్పు వెలువరించింది. విచారణకు వచ్చిన పిటిషన్లను రెండు వర్గాలుగా విభజించినట్లు ధర్మాసనం తెలిపింది. ఒకటి ఈశాన్య ఢిల్లీ అల్లర్లకు సంబంధించినవి కాగా, మరొకటి 2019లో జామియా మిలియా ఇస్లామియాలో జరిగిన హింసకు సంబంధించినవని పేర్కొంది.

తీర్పులో పేర్కొన్న కారణాల దృష్ట్యా అన్ని పిటిషన్లను కొట్టివేస్తున్నాం అని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే తీర్పుకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన ఉత్తర్వులు ఇంకా వెలువడాల్సి ఉంది.2020 ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన పిటిషన్లలో రాజకీయ నాయకులు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్వేషపూరిత ప్రసంగాలపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాలని కోరుతూ పిటిషన్లు దాఖలయ్యాయి. అల్లర్లపై SIT లేదా విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని, స్వతంత్ర వాస్తవ నిర్ధారణ కమిటీ ద్వారా దర్యాప్తు చేయాలని కూడా పిటిషనర్లు కోరారు.

అల్లర్లలో పోలీసుల పాత్రపై కూడా కొన్ని పిటిషన్లలో ఆరోపణలు ఉన్నాయి. బాధితులకు వైద్య చికిత్స, పరిహారం అందించేందుకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కూడా పిటిషనర్లు కోరారు.

Also Read:వైవా హర్ష ..లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్

2020 ఫిబ్రవరి 24న పౌరసత్వ సవరణ చట్టం (CAA)కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల నేపథ్యంలో ఈశాన్య ఢిల్లీలో మతపరమైన ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ హింసలో కనీసం 53 మంది మరణించగా, సుమారు 700 మంది గాయపడినట్లు కోర్టు ముందు సమర్పించిన వివరాల్లో పేర్కొన్నారు.మరోవైపు 2019 డిసెంబర్‌లో CAA వ్యతిరేక నిరసనల నేపథ్యంలో జామియా మిలియా ఇస్లామియాలో జరిగిన హింసపై కూడా ప్రత్యేక దర్యాప్తు కోరుతూ పిటిషన్లు దాఖలయ్యాయి. పోలీసులకు, కేంద్ర ప్రభుత్వానికి స్వతంత్రంగా పనిచేసే SITతో ఈ ఘటనపై దర్యాప్తు చేయించాలని పిటిషనర్లు కోరారు.ఈ రెండు అంశాలకు సంబంధించిన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు సోమవారం కొట్టివేసింది.

- Advertisement -