మహిళలకు ఆర్థిక స్వావలంబన ముఖ్యం!

2
- Advertisement -

కుటుంబ బాధ్యతల కారణంగా చాలా మంది మహిళలు తమకు వచ్చిన పెద్ద అవకాశాలను వదులుకుంటారని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా చెప్పారు. కుటుంబం, ఉద్యోగం మధ్య సమతుల్యం కోసం మహిళలు ఎన్నో త్యాగాలు చేస్తారని ఆమె పేర్కొన్నారు. కుటుంబంలో అందరి గురించి ఆలోచిస్తూ వారి శ్రేయస్సు కోసం మహిళలు కృషి చేస్తారని అన్నారు.

తన రాజకీయ ప్రయాణం గురించి మాట్లాడిన రేఖా గుప్తా,…నా రాజకీయ ప్రయాణం పొగమంచుతో కప్పబడిన చలికాలపు ఉదయం లాంటిది. మొదట్లో నా గమ్యం ఏమిటో నాకు తెలియదు అని చెప్పారు. కాలేజీ ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసినప్పుడు విద్యార్థి రాజకీయాలు చాలా ఉత్కంఠభరితంగా ఉండేవని గుర్తు చేసుకున్నారు. తన రాజకీయ ప్రయాణానికి తండ్రి ప్రోత్సాహం ఎంతో ముఖ్యమని ఆమె చెప్పారు.

రాజకీయాలు చాలా కాలంగా పురుషాధిక్య రంగంగా భావించబడుతున్నాయని, అయితే ఇప్పుడు పరిస్థితి మారుతోందని రేఖా గుప్తా అన్నారు. మహిళలు రాజకీయాలతో పాటు అనేక రంగాల్లో తమ ప్రతిభను చాటుతున్నారని తెలిపారు. మహిళలు నాయకత్వంలో దయ, సహానుభూతి వంటి లక్షణాలు తీసుకువస్తారని ఆమె చెప్పారు. ఇవి నిర్ణయాలలో మానవీయ కోణాన్ని తీసుకువస్తాయని పేర్కొన్నారు. పాలనలో ప్రతి విషయాన్ని సాదాసీదా సమీకరణంలా చూడలేం అంటూ నిర్ణయాల్లో వివిధ కోణాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన చాలా అవసరమని, ప్రతి మహిళ తన కాళ్లపై తాను నిలబడే అవకాశం పొందాలని ఆమె అన్నారు.

Also Read:ఇంట్రెస్టింగ్‌గా విక్రమ్ ఆన్ డ్యూటీ!

సమాజాన్ని బలంగా, సమగ్రంగా నిర్మించాలంటే మహిళలను శక్తివంతం చేయడం అత్యంత కీలకమని ఆమె పేర్కొన్నారు. నిర్ణయాత్మక ప్రక్రియల్లో మహిళలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా ఆమె అన్నారు.

- Advertisement -