ఢిల్లీ గాలి కాలుష్యం తీవ్రమవుతున్న నేపథ్యంలో, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ‘సీవియర్’ స్థాయికి చేరడంతో ఢిల్లీ ప్రభుత్వం మరింత కఠిన చర్యలను అమల్లోకి తీసుకొచ్చింది. నిర్మాణ సామగ్రి తరలించే వాహనాలపై నిషేధం, హైబ్రిడ్ వర్క్ విధానం (వర్క్ ఫ్రం హోం), వాహనాలకు తప్పనిసరి PUC సర్టిఫికెట్లు వంటి నిర్ణయాలు తీసుకుంది.
డిసెంబర్ 13 (శనివారం) నుంచి మూడు రోజుల పాటు గాలి నాణ్యత తీవ్రమైన స్థాయిలో ఉండటంతో, కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ GRAP-4 ఆంక్షలను అమలు చేసింది. వీటికి అదనంగా ఈ కొత్త చర్యలు గురువారం నుంచి అమల్లోకి వస్తాయి.
ఢిల్లీ లేబర్ మంత్రి కపిల్ మిశ్రా ప్రకారం, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు తప్పనిసరిగా వర్క్ ఫ్రం హోం విధానాన్ని అమలు చేయాలి. అయితే కార్యాలయాలు పరిమితంగా పనిచేయవచ్చు. ఢిల్లీ పరిధిలోని అన్ని ప్రైవేట్ కార్యాలయాల్లో గరిష్టంగా 50 శాతం సిబ్బంది మాత్రమే కార్యాలయానికి రావాలి. మిగిలిన వారు తప్పనిసరిగా ఇంటి నుంచే పని చేయాలి.
అత్యవసర సేవలు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు—ఆసుపత్రులు, కాలుష్య నియంత్రణ విభాగాలు, అగ్నిమాపక శాఖ, ఆరోగ్య, రవాణా, పారిశుద్ధ్య సేవలకు ఈ నిబంధనలు వర్తించవు. నిర్మాణ పనుల నిలిపివేత వల్ల ప్రభావితమైన కార్మికులకు GRAP-4 అమల్లో ఉన్న కాలానికి ₹10,000 పరిహారం అందించనున్నట్లు మంత్రి తెలిపారు.
Also Read:దావోస్‌కు రేవంత్..కోర్టు పర్మిషన్
PUC (పల్యూషన్ అండర్ కంట్రోల్) సర్టిఫికెట్ లేకుండా వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం ఇవ్వబోమని పర్యావరణ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా ప్రకటించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.20,000 వరకు జరిమానా విధించవచ్చు.
PUC సర్టిఫికెట్ ఫీజులు:
రెండు/మూడు చక్రాల వాహనాలు: ₹60
నాలుగు చక్రాల వాహనాలు: ₹80
డీజిల్ వాహనాలు: ₹100
BS-IV, BS-VI వాహనాలకు సర్టిఫికెట్ 12 నెలల పాటు చెల్లుబాటు అవుతుంది. అమలుకు నగరవ్యాప్తంగా 126 చెక్‌పాయింట్లు, పెట్రోల్ బంకుల్లో 537 మంది పోలీసులు మోహరించనున్నారు. GRAP-3, GRAP-4 అమల్లో ఉన్నంత కాలం, ఢిల్లీ బయట రిజిస్టర్ అయిన BS-6 కంటే తక్కువ ప్రమాణాల వాహనాలు నగరంలోకి ప్రవేశించకుండా నిషేధం విధించారు. గురువారం నుంచే ఈ నిషేధం అమల్లోకి వస్తుంది. ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్, రవాణా శాఖ సరిహద్దులు, పెట్రోల్ బంకుల్లో తనిఖీలు చేపడతాయి.

